Raju Srivastava | ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రీవాస్తవ జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆయన ఇంకా స్పృహలోకి రాకపోవడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు స్టార్ కమెడియన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో గుండెకొట్టుకోవడం, బీపీ, ఆక్సిజన్ లెవల్ సాధారణంగానే ఉన్నట్లు తెలిసింది. జ్వరంతో బాధపడుతుండడంతో వెంటిలేటర్ సపోర్టును కొనసాగించాలని వైద్యులు నిర్ణయించారు. గత మంగళవారం తాత్కాలికంగా వెంటిలేటర్ సపోర్టును తొలగించారు. ఆ తర్వాత మళ్లీ వెంటిలేటర్ సపోర్టు ఇచ్చారు.
ఇంతకు ముందు సైతం ఇలాగే రెండుసార్లు వెంటిలేటర్‌ను తొలగించారు. ప్రసుత్తం వైద్యులు రాజు శ్రీవాస్తవను స్పృహలోకి తీసుకువచ్చేందుకు రాత్రి పగలూ ప్రయత్నిస్తున్నారని, స్పృహలోకి వచ్చేందుకు పది రోజులు, అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చని సన్నిహిత బంధువులు పేర్కొన్నారు. కమెడియన్ ఆగస్టు 10న గుండెపోటు గురవగా.. అప్పటి నుంచి స్పృహలోకి రావడం లేదు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎస్ఓడీ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, అచల్ శ్రీవాస్తవ పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నది. మరో వైపు కమెడియన్ త్వరగా కోలుకోవాలని.. ఆయన కుటుంబీకులు ఇంట్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ జపం చేస్తున్నారు.