Rajkumar Hirani | ‘3 ఇడియట్స్’ సీక్వెల్‌పై వస్తున్న వార్తల గురించి బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ఎట్టకేలకు స్పందించాడు. ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని అభిమానులకు గుడ్ న్యూస్‌ని అందించాడు. ఇక మీడియాలో వస్తున్నట్టుగా కొత్త ఇడియట్స్ ఎవరూ జాయిన్ కావడం లేదని, ఇది కేవలం ‘3 ఇడియట్స్’ సీక్వెల్ మాత్రమేనని తేల్చి చెప్పారు. కథ ఒరిజినల్ సినిమా ముగిసిన 20 ఏళ్ల తర్వాత సాగుతుందని హిరానీ వెల్లడించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఇంకా రాసే దశలోనే ఉందని దీనిపై చాలా ఉత్సాహంగా ఉందని హిరానీ అన్నారు.
ఇటీవల ఆమిర్ ఖాన్ ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం సిద్ధమవుతున్నట్టు చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఆమిర్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి త్రయంతో పాటు నాలుగో ఇడియట్గా విక్కీ కౌశల్ జాయిన్ అవుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన హిరానీ నవ్వుతూ, ‘దీని పేరు ‘4 ఇడియట్స్’ అని నాకు కూడా తెలిసింది. ఆ పేరు నేను పెట్టలేదు, మీడియానే పెట్టింది. నిజానికి నాలుగో ఇడియట్ ఎవరూ లేరు. ఇది ‘3 ఇడియట్స్’ మాత్రమే. మనం ఎక్కడ ముగించామో దానికి 20 ఏళ్ల తర్వాత కథ’ అని క్లారిటీ ఇచ్చారు.
2009 బ్లాక్‌బస్టర్‌కు కొనసాగింపుగా సీక్వెల్ రానుందనే వార్తలతో ఈ ప్రాజెక్ట్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఇంతకుముందు ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ, హిరానీ తనతో ఒక ఐడియా షేర్ చేశారని, పాత్రల జీవితాల్లో తదుపరి అధ్యాయాన్ని తెరకెక్కించడానికి టీమ్ ఆసక్తిగా ఉందని చెప్పారు. రాంచో, ఫర్హాన్, రాజు పాత్రలను రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ చూపిస్తామని హింట్ ఇచ్చిన ఆమిర్, ‘3 ఇడియట్స్’ ప్రపంచంలోకి తిరిగి రావడానికి తగిన బలమైన కథ ఉంటేనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఆమిర్ ఖాన్, ఆర్ మాధవన్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ‘3 ఇడియట్స్’ హిందీ సినిమాల్లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. కరీనా కపూర్ ఖాన్, బోమన్ ఇరానీ, మోనా సింగ్, అలీ ఫజల్ కూడా ఈ చిత్రంలో నటించారు.