రాజ్‌కుమార్ హిరాణీ సినిమాలంటే చక్కటి వినోదంతో పాటు అంతర్లీనంగా గొప్ప సామాజిక సందేశం ఉంటుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన మున్నాభాయ్ సిరీస్ చిత్రాలతో పాటు త్రీ ఇడియట్స్, పీకే, సంజు చిత్రాలు భారీ విజయాలను సాధించాయి. ఈ నేపథ్యంలో షారుఖ్‌ఖాన్- రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్లో ఈ నెల 21న విడుదల కాబోతున్న ‘డంకీ’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విదేశాలకు అక్రమంగా వలస వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల నేపథ్య కథతో దేశభక్తి అంశాన్ని స్పృశిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా షారుఖ్‌ఖాన్ ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
విదేశాల్లో నిజమైన జైలులో కొన్ని కీలక ఘట్టాలను చిత్రీకరించామని, ఆ షూటింగ్ మరచిపోలేని అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘మనదేశం జైళ్లతో పోల్చితే విదేశాల్లోని జైళ్లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అమెరికాలో రియల్ జైలులో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడ శిక్షననుభవిస్తున్న ఖైదీల గురించి తెలుసుకొని షాక్ తిన్నాను. వాళ్లు డేంజరస్ క్రిమినల్స్. భయంకరమైన నేరాలకు పాల్పడ్డారు. వారి మధ్యలో షూటింగ్ చేయడం కాస్త భయంగా అనిపించింది. అయితే అందులో కొంతమంది నన్ను గుర్తుపట్టి ‘షారుఖ్ షారుఖ్’ అనడం కూడా వినిపించింది’ అని చెప్పుకొచ్చారు షారుఖ్‌ఖాన్.