సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా జాతీయ నటుడు కమల్‌హాసన్ నిర్మాతగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే ‘తలైవర్ 173’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే ఈ సినిమాకు డైరెక్టర్‌గా పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. చివరకు ‘ఓ మై కడవలే’ ఫేం అశ్వత్ మారిముత్తుకి ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించే బాధ్యతను అప్పగించారు కమల్, రజనీ. పూర్తి వివరాల్లోకెళ్తే.. ఇదివరకే అశ్వత్ మారిముత్తు ఏజీఎస్ అనే సంస్థకు ఓ సినిమా చేసిపెట్టేందుకు కమిటై ఉన్నారు.
అయితే.. రజనీకాంత్ కోరిక మేరకు సదరు సంస్థ NOC ఇచ్చి, కమిట్మెంట్ని రద్దు చేయడంతో రజనీ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అశ్వత్‌కు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. అశ్వత్ మారిముత్తు వినిపించిన కమర్షియల్ స్క్రిప్ట్ రజనీకాంత్‌కి నచ్చడమే ఈ పరిణామాలకు కారణం.
ప్రస్తుతం ఈ సినిమా పనులు వేగవంతమయ్యాయి. దర్శకుడు అశ్వత్ స్క్రిప్ట్ తుది మెరుగుల్లో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూలైలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదలచేయాలని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నది. రెండు దిగ్గజాల నుంచి వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలున్నాయి.