Rajinikanth : సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హిమాలయాల్లో పర్యటిస్తున్నారు. ఒక భారీ చిత్రం షూటింగ్ పూర్తిచేసిన తర్వాత, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టడానికి ముందు మానసిక ప్రశాంతత కోసం రజనీకాంత్ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ ఆనవాయతీని కొనసాగిస్తూ ఆయన హిమాలయ యాత్ర చేపట్టారు.
‘కూలీ’ చిత్రం చిత్రీకరణను ఇటీవలే ముగించుకున్న రజినీకాంత్.. ‘జైలర్ 2’ షూటింగ్ ప్రారంభానికి ముందు వారం రోజులపాటు హిమాలయాల్లో గడపనున్నారు. ఈ యాత్రలో భాగంగా రజినీకాంత్ రిషికేశ్‌లోని ఆశ్రమంలో బసచేస్తూ బద్రీనాథ్, మహావతార్ బాబాజీ గుహ తదితర పవిత్ర స్థలాలను దర్శించుకున్నారు. హిమాలయాల ప్రకృతి సౌందర్యం నడుమ ధ్యానం చేశారు. ఒక ఫొటోలో రజినీ ఎంతో సింపుల్‌గా రోడ్డు పక్కన అల్పాహారం తింటూ కనిపించారు.
రజినీకాంత్ యాత్రకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యాత్రలో రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడంవల్ల ఒక కొత్త అనుభవం లభిస్తుంది. ప్రపంచమంతటికీ ఆధ్యాత్మికత చాలా అవసరం. అదే మనిషికి తృప్తిని, ప్రశాంతతను ఇస్తుంది’ అని అన్నారు. భగవంతుడిపై విశ్వాసం జీవితంలో సమతుల్యతను అందిస్తుందని చెప్పారు.
కాగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో నటించిన ‘కూలీ’ సినిమా తర్వాత రజినీ.. ‘జైలర్’కు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ‘జైలర్ 2’ చేయనున్నారు. ఈ విరామంలో శారీరకంగా, మానసికంగా నూతన శక్తి పొందడానికి ఆయన ఈ యాత్రను ఎంచుకున్నారు. యాత్ర ముగించుకుని చెన్నైకి వచ్చిన తర్వాత ఆయన ‘జైలర్ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ లాంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.