Rajinikanth | సాధారణంగా ఒక సినిమా ఆలస్యం అయితే కొన్ని నెలలు లేదా గరిష్ఠంగా రెండు మూడు సంవత్సరాల వరకే ఉంటుంది. కానీ తాజాగా ఓ సినిమా ఏకంగా 37 ఏళ్ల తర్వాత విడుదలకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ సినిమా మరేదో కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ దిగ్గజ నటుడు శత్రుఘ్న సిన్హా హీరోలుగా నటించిన హిందీ చిత్రం ‘హమ్ మే షా హెన్ షా కౌన్’. 1989లో తెరకెక్కిన ఈ చిత్రంలో హేమా మాలిని కీలక పాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే విడుదల చేస్తామని నిర్మాతలు అధికారికంగా ప్రకటించడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇద్దరు పెద్ద స్టార్స్ కలిసి నటించిన సినిమా కావడంతో, తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేయాలన్న ఆలోచన కూడా మేకర్స్‌లో ఉన్నట్లు సమాచారం.
అయితే నిర్మాణానంతర పనులు చివరి దశలో ఉన్న సమయంలో అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. కారణాలు మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఆ తర్వాత ఈ సినిమాను మళ్లీ విడుదల చేసే ప్రయత్నాలు పలు సార్లు జరిగినా, అవన్నీ విఫలమయ్యాయి. కాలక్రమేణా దర్శకుడు, నిర్మాతలు మృతి చెందడం, ఆర్థిక సమస్యలు, లీగల్ ఇష్యూలు వంటి కారణాలతో ఈ సినిమా ఫైళ్లకే పరిమితమైంది. దాంతో ఈ సినిమా ఎప్పటికైనా విడుదల అవుతుందన్న ఆశలు పూర్తిగా ఆరిపోయాయి. కాలం గడిచేకొద్దీ ఈ సినిమా గురించి పని చేసిన చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. మరికొందరు ఉన్నప్పటికీ, అలాంటి సినిమా ఉందన్న విషయాన్నే మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా ఈ సినిమా విడుదలపై వార్తలు రావడం ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలోనూ చర్చనీయాంశంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రీల్ ఫార్మాట్లో ఉన్న సినిమాను ఇప్పటికే డిజిటల్ ఫార్మాట్‌గా మార్చారని తెలుస్తోంది. అంతేకాదు, సౌండ్ క్వాలిటీ, విజువల్స్ మెరుగుపరచడంతో పాటు, హీరోల పాత్రలను మరింత ఆకర్షణీయంగా చూపించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువచ్చే బాధ్యతను గతంలో అసోసియేట్ ప్రొడ్యూసర్లుగా పనిచేసిన షబానా, అస్లాం మీర్జా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ కేటాయించి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు రజనీకాంత్, శత్రుఘ్న సిన్హా, హేమా మాలిని నుంచి అవసరమైన అనుమతులు, అలాగే మ్యూజిక్ కాపీరైట్‌కు సంబంధించిన అంశాలపై కూడా లీగల్ చర్చలు జరుగుతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 37 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా చివరకు 2026 ఏప్రిల్‌లో విడుదల అవుతుందని నిర్మాతలు ధీమాగా చెబుతున్నారు.