సూపర్‌స్టార్ రజనీకాంత్ బయోపిక్ గురించి ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. బెంగళూరులో సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి వెండితెర సూపర్‌స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్థానాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. తాజాగా రజనీకాంత్ బయోపిక్ గురించి ఆయన కుమార్తె ఐశ్వర్య ఆసక్తికరమైన అప్డేట్ను వెల్లడించారు. తన తండ్రి జీవిత కథా చిత్రాన్ని ఇప్పటికే ప్రారంభించామని, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, ప్రపంచవ్యాప్తంగా అదొక సంచలనంగా ఉండబోతున్నదని ఆమె చెప్పారు.
ఈ ప్రకటనతో రజనీకాంత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన దర్శకుడు, నటీనటుల వివరాలను ఐశ్వర్య వెల్లడించలేదు. త్వరలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు బయటికొస్తాయని చెన్నై సినీ వర్గాల టాక్. గత ఏడాది ‘కూలీ’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఆయన ‘జైలర్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత శిబి చక్రవర్తి దర్శకత్వంలో కమల్‌హాసన్ నిర్మించనున్న సినిమాలో నటించబోతున్నారు.