Rajinikanth | రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరే నటుడు అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్నారు. సూపర్ స్టార్‌గా ఎదిగినా చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ.. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం చాలామందికి ఆయన కెరియర్ గురించి మాత్రమే తెలుసు. వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ క్రమంలో చాలా మంది ఆయన గురించి మరింత తెలుసుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతున్నది. తలైవా త్వరలోనే తన ఆటోబయోగ్రఫీని రాయనున్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. రజనీకాంత్ టీమ్ మాత్రం ఆటోబయోగ్రఫీని ధ్రువీకరించలేదు.. కొట్టిపారేయనూ లేదు. ప్రస్తుతం ఆయన కూలీ, జైలర్- సినిమాల షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్ పూర్తయ్యాక తన ఆత్మకథని రాయబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, కెరియర్‌పై పాడ్‌కాస్ట్ ద్వారా ఆత్మకథను ప్రేక్షకుల ముందుంచనున్నట్లు టాక్ నడుస్తున్నది. తలైవా మొదట బస్ కండక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత ఓ స్నేహితుడి సూచన మేరకు సినిమాల్లోకి ఇంట్రీ ఇచ్చారు. దక్షిణాది చిత్రాలతో పాటు హిందీలోనూ నటించారు. దక్షిణాదిలో ఆయన సినిమాలకు భారీగా క్రేజ్ ఉంటుంది.
రజనీ తనదైన మ్యానరిజం అభిమానులను అలరిస్తూ వస్తున్నారు. ఆయనకు జపాన్‌లోనూ భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ పేరుతో ఫ్యాన్స్ క్లబ్స్ సైతం ఏర్పడ్డాయి. రజనీకాంత్‌ని కలిసేందుకు జపాన్ నుంచి ఆయన ఇంటికి, సినిమా షూటింగ్ లొకేషన్స్‌కు సైతం వస్తుంటారు. ఆయన వారిని ఏమాత్రం నిరాశకు గురి చేయకుండా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా రజనీకాంత్ ఆటో బయోగ్రఫీని రాస్తే.. భారతీయ అభిమానులతో పాటు జపాన్‌లోని ఫ్యాన్స్‌కు ఓ గిఫ్ట్‌ని అందించినట్లే. ఇక రజనీకాంత్ చివరిసారిగా వెట్టాయన్ చిత్రంలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నది. ప్రస్తుతం ఆయన కూలీ, జైలర్-2 చిత్రాల్లో బిజీగా ఉన్నారు.