Coolie | ఈ పంద్రాగస్టుకు బాక్సాఫీసు దగ్గర రెండు పెద్ద సినిమాలు తలపడబోతున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ వార్ 2 మూవీతో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హృతిక్ రోషన్ కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాకు పోటీగా సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాతో వస్తున్నాడు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎల్సీయూలో ఈ సినిమా భాగమనే ప్రచారంతో పాటు.. నాగార్జున, ఆమీర్‌ఖాన్, సత్యరాజ్, ఉపేంద్ర, శ్రుతిహాసన్, సోబిన్ షాహిర్ వంటి ఆగ్ర నటులు నటిస్తుండటంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో ఈ స్టార్ క్యాస్ట్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
‘కూలీ’లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాతలు పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేశారు. పలు నివేదికల ప్రకారం దాదాపు రూ.350 కోట్లతో సినిమాను మేకర్స్ నిర్మించారు. ఈ సినిమా కోసం హీరో రజనీకాంత్‌కే రూ.150కోట్ల నుంచి రూ.200 చెల్లించినట్లు సమాచారం. ఈ మూవీలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ దేవ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం రూ.150కోట్లు నిర్మాతలు రజనీకాంత్‌కు చెల్లించారని.. మూవీకి వస్తున్న రెస్పాన్స్.. అడ్వాన్స్ బుకింగ్స్ నేపథ్యంలో రెమ్యునరేషన్‌ను రూ.200కోట్లకు పెంచినట్లు పలు నివేదికలు తెలిపాయి.
ఇక ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న దర్శకుల్లో లోకేశ్ ఒకరు. ఈ చిత్రానికి యువ దర్శకుడు సైతం భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. సమాచారం మేరకు.. లోకేశ్ కనగరాజ్‌కు ఈ మూవీకి రూ.50కోట్ల పారితోషకం అందించినట్లు తెలుస్తున్నది. లోకి మాస్టర్, విక్రమ్, లియో చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సాధించారు. బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ఈ మూవీలో గెస్ట్‌రోల్‌లో కనిపించనున్నారు. ఆమీర్ది చిన్న పాత్ర అయినా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలో ఆమీర్ దహా అనే గ్యాంగ్‌స్టర్ పాత్రను పోషించాడు. దాదాపు 15 నిమిషాల పాత్రకు రూ.20 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.
టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సైతం ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో నటించేందుకు రూ.10కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తున్నది. అలాగే, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్ర సినిమా కోసం రూ.15కోట్లు తీసుకున్నట్లు టాక్. జైలర్ మూవీ తర్వాత అనిరుధ్ మరోసారి రజనీకాంత్‌తో కలిసి పని చేస్తున్నారు. బాహుబలి ‘కట్టప్ప’ సత్యరాజ్ ఈ మూవీలో నటించేందుకు రూ.5కోట్లు పారితోషకం తీసుకున్నట్లు తెలుస్తున్నది. కన్నడ నటుడు ఉపేంద్రకు రూ.4కోట్లు ‘కలీష’ పాత్రకు ఛార్జ్ చేసినట్లు తెలుస్తున్నది. ఇక శ్రుతి హసన్ ఈ మూవీలో ‘ప్రీతి’ పాత్రలో కనిపించనున్నది. ఈ బ్యూటీ ఈ మూవీలో ఈ పాత్ర కోసం రూ.4కోట్లు పారితోషకం తీసుకున్నది. అదే సమయంలో ఈ మూవీలో ‘మోనికా’ స్పెషల్ సాంగ్‌కు రూ.కోటి రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది.