Rajendran | కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ మొట్ట రాజేంద్రన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ అనువాద చిత్రాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ సంపాదించిన రాజేంద్రన్ అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన గుండు లుక్. అదే లుక్ ఆయనకు ఒక ఐడెంటిటీగా మారింది. సాధారణ ఫైటర్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన రాజేంద్రన్, ఆ తర్వాత సినిమాల్లో సైడ్ విలన్ పాత్రలు, మెయిన్ విలన్ పాత్రలు చేస్తూ క్రమంగా హీరో స్థాయి ఇమేజ్ను సైతం సంపాదించారు. ఇప్పటివరకు దాదాపు అన్ని స్టార్ హీరోల సినిమాల్లో నటించిన రాజేంద్రన్, తన గుండు వెనుక ఉన్న బాధాకరమైన నిజాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం… ఒక మలయాళ సినిమా షూటింగ్ సందర్భంగా 15 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకాల్సిన సీన్ ఉందట. షూటింగ్ స్పాట్‌కి వెళ్లిన వెంటనే డైరెక్టర్ చెప్పగానే కింద ఉన్నదంతా నీళ్లేనని భావించి ఆయన దూకేశారట. కానీ దూకిన తర్వాత తెలిసింది ఏంటంటే… అది సాధారణ నీరు కాదు, ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చిన కెమికల్ వాటర్ అని. స్థానికులు విషయం చెప్పే వరకు తాను దానిని గ్రహించలేదని రాజేంద్రన్ చెప్పారు. ఈ ఘటన తర్వాత నుంచి జుట్టు రాలడం మొదలైందని, క్రమంగా తలపైన ఉన్న జట్టు అంతా పూర్తిగా ఉడిపోయిందని తెలిపారు. అంతేకాదు, కనుబొమ్మలు, రెప్పల దగ్గర ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోయాయన్నారు. ఆ సమయంలో తాను తీవ్రంగా బాధపడ్డానని, షూటింగ్‌లకు చుట్టూ ఉన్న నటులు అందమైన హెయిర్ స్టైల్స్‌తో వస్తుంటే, తాను మాత్రం బొడి గుండుతో వెళ్లడం చాలా ఇబ్బందిగా అనిపించేదన్నారు.
అయితే అదే గుండు తన జీవితాన్ని మలుపు తిప్పిందని రాజేంద్రన్ గుర్తు చేసుకున్నారు. విలన్ పాత్రల నుంచి క్రమంగా కామెడీ పాత్రలు రావడం మొదలయ్యాయని, గుండు లుక్ వల్లే నటుడిగా తాను మరింత బిజీ అయ్యానన్నారు. “ఇదే తల ఉంటే అన్ని సినిమాలు చేసే వాడిని కాను. ఇదే నా పెద్ద ఐడెంటిటీ అయింది” అంటూ భావోద్వేగంగా చెప్పారు. విగ్ పెట్టుకోవడం కంటే విగ్ తీసేసి తిరిగితేనే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయని, విగ్ పెడితే తనను ఎవరూ గుర్తుపట్టలేరని తెలిపారు. క్లీన్ షేవ్, గుండు లుక్‌తో ఉన్నప్పుడే ప్రేక్షకులు తనను గుర్తించి, థియేటర్లలో ఈలలు, కేకలతో ఆదరిస్తున్నారని చెప్పారు. అలా అభిమానుల స్పందన చూసినప్పుడు తాను చాలా ఆనందంతో పాటు ఎమోషనల్ అవుతానని రాజేంద్రన్ వెల్లడించారు. ఇక రాజేంద్రన్ తెలుగులో ‘ఛలో’, ‘ఎఫ్3’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సర్’, ‘విమానం’, ‘ఓజీ’, ‘త్రిబాణధారి బార్బారిక్’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.