Rajendra Prasad | టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన పేరు చెప్పగానే ముఖంపై నవ్వు పూస్తుంది. మూడు దశాబ్దాలకుపైగా సినీ ప్రస్థానంలో అశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న ఈ నటుడు, ఇప్పటికీ తన హాస్యంతో, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ‘లేడీ టైలర్’, ‘ఆహా నా పెళ్లంటా’, ‘మిస్టర్ పెళ్లాం’, ‘మాయాబజార్’, ‘జూలాయి’, ‘సరైనోడు’ వంటి అనేక సినిమాల్లో తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక ఇటీవల కాలంలో కూడా రాజేంద్ర ప్రసాద్ విలన్, క్యారెక్టర్, తండ్రి పాత్రల్లో తనదైన శైలిలో నటించి తన నటనకు న్యాయం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కాగా, మరోటి శర్వానంద్ నటిస్తున్న చిత్రమని సమాచారం.
ఇదే సమయంలో సినీ వర్గాల సమాచారం ప్రకారం, రాజేంద్ర ప్రసాద్ త్వరలోనే ఒక కొత్త వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది రవితేజ నటించిన మాస్ జాతర సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు.అయితే ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరగగా, ఆ కార్య్రక్రమంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రవితేజ హీరోగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “ఇటీవలి కాలంలో అన్ని మసాలాలు సరిగ్గా కలిసిన మాస్ సినిమా రాలేదు. ఆ లోటును తీర్చేది ఈ మాస్ జాతర” అని విశ్వాసంగా తెలిపారు.
అంతేకాకుండా, “ప్రేక్షకులు థియేటర్లో ఈ సినిమాను చూస్తే ఖచ్చితంగా ఆనందంతో తేలిపోతారు” అని అన్నారు. తన మాటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ, “ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే నేను సినిమాల నుంచి తప్పుకుంటాను” అని రాజేంద్ర ప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. తన కెరీర్లో ఎందరో తారలతో కలిసి పనిచేసినప్పటికీ, రవితేజతో ఇదే తన మొదటి కాంబినేషన్ అని చెప్పారు. రవితేజతో కలిసి పనిచేయడం ప్రత్యేక అనుభూతిగా ఉంది. మాస్ జాతర అనే అద్భుతమైన సినిమాను చేయడానికి ఇంత సమయం పట్టింది. దర్శకుడు భాను అద్భుతంగా తెరకెక్కించారు. నా పాత్ర గురించి ఇప్పుడే చెబితే థ్రిల్ పోతుంది , థియేటర్లో చూసి ఆనందించండి” అని అన్నారు.