రాజేంద్రప్రసాద్, నరసింహరాజు ప్రధాన పాత్రల్లో వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. జగన్మోహన్ డీవై నిర్మాత. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను విశాఖపట్నంలో నిర్వహించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘నా 45 ఏళ్ల నట జీవితంలో గుర్తుండిపోయే అత్యద్భుతమైన సినిమా ఇది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుంది. కుటుంబంతో కలిసి థియేటర్లో సినిమా చూడాలని కోరుతున్నా’ అన్నారు. ‘హృదయాన్ని కదిలించే ఎమోషన్స్ ఉన్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్‌గారు షూటింగ్ సమయంలో గాయపడ్డారు. అయినా లెక్కచేయకుండా షూటింగ్ కొనసాగించారు’ అని నిర్మాత తెలిపారు. ‘ఈ సినిమా ప్రీమియర్షో చూసిన వారందరూ మెచ్చుకున్నారు. రాజేంద్రప్రసాద్‌గారు మాత్రమే చేయాల్సిన పాత్ర ఇది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుంది’ అని దర్శకుడు పేర్కొన్నారు. గొప్ప కథలో భాగం కావడం ఆనందంగా ఉందని నరసింహరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.