అగ్ర హీరో రాజశేఖర్ ’బైకర్ ’ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 25న ఈ ఘటన జరిగినట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని, వెంటనే ఆయన్ని దవాఖానకు తరలించగా మేజర్ సర్జరీ చేశారని చిత్ర వర్గాలు తెలిపాయి. కుడి కాలి మడమ దగ్గర బలమైన గాయం కావడంతో సర్జరీకి మూడు గంటలు పట్టిందని సమాచారం.
సర్జరీలో భాగంగా రాజశేఖర్ కాలిలో ప్లేట్స్ అమర్చారు. ప్రస్తుతం ఆయన రికవరీ అవుతున్నారని వైద్యులు పేర్కొన్నారు మూడు నుంచి నాలుగు వారాలపాటు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని రాజశేఖర్‌కు వైద్యులు సూచించారు. దీంతో కొన్ని రోజులపాటు ఆయన చిత్రీకరణలకు దూరంగా ఉండనున్నారు. పూర్తిగా కోలుకున్నాక జనవరిలో మళ్లీ షూటింగ్లో పాల్గొనే అవకాశమున్నదని అయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. శర్వానంద్ కథానాయకుడిగా ’బైకర్ ’ సినిమా తెరకెక్కుతున్నది. ఇందులో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు.