Rajamouli | జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్‌లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి షేక్‌పేట్ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. అలాగే నటుడు శ్రీకాంత్ కుటుంబం కూడా తమ ఓటు హక్కును వినియోగించింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
ఉపఎన్నికలో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల కోసం 1,761 మంది పోలీసులు, 800 మంది కేంద్ర బలగాలు మోహరించారు. పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈసారి డ్రోన్లు కూడా వినియోగిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ప్రధానంగా ప్రశాంతంగానే కొనసాగుతున్నప్పటికీ, కొన్ని చోట్ల సాంకేతిక లోపాలు చోటుచేసుకున్నాయి. బోరబండలోని బూత్ 348లో ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ కొంతసేపు నిలిచిపోయింది. అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
మరోవైపు, వెంగళరావు నగర్ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తత నెలకొంది. సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్‌పై ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని BRS నాయకులు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద పోలింగ్ శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. ఇక రాజమౌళి విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. మూవీపై మరింత ఆసక్తి పెంచేందుకు వినూత్న ప్రమోషన్స్ చేస్తున్నారు జక్కన్న. నవంబర్ 15న మూవీకి సంబంధించి గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ప్లాన్ చేయగా, ఈ ఈవెంట్లో ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.