Maasai Mara National Reserve | దిగ్గజ దర్శకుడు రాజమౌళి – సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో రాబోతున్న సినిమా (SSMB29) షూటింగ్ ప్రస్తుతం కెన్యాలో జరుగుతున్న విషయం తెలిపిందే. ఇందులో మసాయి మారా (Maasai Mara National Reserve) కూడా ఒక ప్రధానమైన లొకేషన్ అని వార్తలు వస్తున్నాయి. అయితే వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయిన ఈ టూరిస్ట్ డెస్టినేషన్‌లో షూటింగ్ చేస్తుండటంతో సినిమా ఎలా ఉండబోతుందని.. మాసాయి మారాని రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అందరిలో మొదలైంది. దీనిపై అప్డేట్ రావాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. అయితే కెన్యాలో పాపులర్ అయిన ఈ మాసాయి మారా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కెన్యా రాజధాని నైరోబికి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మసాయి మారా ప్రఖ్యాత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వరల్డ్ వైడ్‌గా ఉన్న పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. టాంజానియాలోని సెరెంగెటి నేషనల్ పార్క్‌కు ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతానికి, స్థానిక ప్రజలైన మసాయి తెగ.. అలాగే అక్కడ ప్రవహించే మారా నది పేర్ల మీదగా ఈ పేరు వచ్చింది. ఇక్కడ అనేక రకాల అరుదైన జంతువులు జీవనం సాగిస్తుంటాయి. ఆఫ్రికాలోని “బిగ్ ఫైవ్” (సింహం, చిరుతపులి, ఏనుగు, ఖడ్గమృగం, గేదె) ను ఒకే చోట చూడాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం.
అంతేగాకుండా ప్రతి సంవత్సరం జూలై నుంచి అక్టోబర్ మధ్య జరిగే భారీ జంతువుల వలస(great migration) కోసం మసాయి మారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. జూలై నుంచి అక్టోబర్ మధ్య లక్షలాది అడవి దున్నలు, జీబ్రాలు మరియు ఇతర జంతువులు మారా నదిని దాటుతూ వేరే ప్రాంతానికి వలస వెళ్తాయి. ఈ అరుదైన దృశ్యం చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలి వస్తుంటారు. పర్యాటకుల కోసం ఇక్కడ జంగిల్ సఫారీలు, హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ల వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ప్రకృతి సౌందర్యం, అడవి జంతువుల జీవనం గురించి తెలుసుకోవడానికి మసాయి మారా ఒక ఉత్తమ ప్రదేశం అని పర్యాటక నిపుణులు చెబుతున్నారు.