Rajamouli | ‘వారణాసి’ టైటిల్ లాంచింగ్ కార్యక్రమంలో హనుమంతుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై రాష్ట్రీయ వానరసేన సంస్థ ఫిర్యాదు నమోదు చేసింది. ఈ ఫిర్యాదును సోమవారం సరూర్నగర్ పోలీస్ స్టేషన్లో అధికారులకు అందజేశారు. ఫిర్యాదులో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల భావాలను తీవ్రంగా దెబ్బతీశాయని వానరసేన పేర్కొంది. ఇటీవలి కాలంలో సినిమాల్లో హిందూ దేవతలను అవమానించే ధోరణి పెరుగుతోందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మత విశ్వాసాలను దెబ్బతీయడం చట్ట విరుద్ధం. రాజమౌళిపై కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ జరపాలి” అని సంస్థ సభ్యులు డిమాండ్ చేశారు.
సంస్థ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో సినీ రంగంలో ఇలాంటి వ్యాఖ్యలు, ప్రవర్తనలకు అడ్డుకట్ట వేయాలని స్పష్టంగా పేర్కొంది. మతపరమైన భావాలను కించపరిచే వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయకూడదని, ఇలాంటి ఘటనలు మరల జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. ఫిర్యాదు నమోదయ్యాక ఈ అంశం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అభిమానులు, సినీ ప్రేమికులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రాజమౌళిని తప్పుబడుతుంటే, మరికొందరు ఆయన వ్యాఖ్యలు అపార్థం చేశారంటూ సమర్థిస్తున్నారు.
పోలీసులు ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ‘వారణాసి’ ఈవెంట్లో రాజమౌళి చేసిన కామెంట్స్ రాబోయే రోజుల్లో రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక వారణాసి విషయానికి వస్తే ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతుండగా, ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇటీవల విడుదలైన గ్లింప్స్ ఫ్యాన్స్కి మాంచి కిక్ ఇచ్చింది. 2027లో మూవీని విడుదల చేసే ప్లాన్లో ఉన్నారు.