Raja Saab | ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ హారర్ మూవీ ‘రాజా సాబ్’. ఈ తరహా జానర్లో ప్రభాస్ నటించడం ఇదే ప్రథమం. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ఆయనకు విషెస్ తెలుపుతూ ‘రాజా సాబ్’ మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఓ వ్యక్తి అడవిలో నడుస్తూ పెద్ద భవంతికి చేరుకున్నాడు. ఆ భవంతిలో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్న రాజా సాబ్‌ను మోషన్ మోస్టర్లో పరిచయం చేశారు.
చేతిలో సిగార్, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ ైస్టెల్‌తో రాజా సాబ్‌గా ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానుల్ని అలరించేలా ఉంది. మోషన్ పోస్టర్‌కు తమన్ ఇచ్చిన రాజా సాబ్ థీమ్ సాంగ్ ఆకర్షణగా నిలిచింది. ‘హారర్ ఈజ్ ది న్యూ హ్యూమర్’ అనే క్యాప్షన్ ఈ పోస్టర్ చివరలో వేసి, కథపై దర్శకుడు మారుతి ఆసక్తిని పెంచారు. ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని.