కష్టాల్లో ఉన్నవాళ్లని కాపాడేవాడే కథానాయకుడు. కానీ.. ఆ కాపాడేవాడే చంపటం మొదలుపెడితే? ఈ పశ్నకు సమాధానంగా రూపొందుతున్న థ్రిల్లర్ కామెడీ డ్రామా ‘టార్టాయిస్’. రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంలోనే ఈ సినిమా మోషన్ పోస్టర్ని కూడా మేకర్స్ విడుదల చేశారు.
టైటిల్ మాదిరిగానే కథ కూడా కొత్తగా ఉంటుందని, దర్శకుడు రిత్విక్కుమార్ కథ చెప్పిన విధానం బావుందని, మంచి కథతో వస్తున్న నిర్మాతలు శశిధర్ నల్ల, విజయ్‌కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబుగార్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని, తన కెరీర్‌కు మంచి కిక్ ఇచ్చే సినిమా ఇదని హీరో రాజ్ కిరణ్ తెలిపారు.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, దర్శకుడు రిత్విక్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శబరి, సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: చంద్రబోస్.