‘ప్రాపర్ క్రైమ్ కామెడీ ఇది. ప్రతి సిట్యువేషన్‌లోనూ ఫన్ ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అనుకున్నదానికంటే గొప్పగా సినిమా వచ్చింది.’ అని రాజ్‌తరుణ్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పాంచ్ మినార్’. రాశిసింగ్ కథానాయిక. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు.
ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్బంగా రాజ్‌తరుణ్ మీడియాతో మాట్లాడారు. ‘వినడానికి క్యాచీగా ఉందని ‘పాంచ్ మినార్’ టైటిల్ పెట్టలేదు. ఈ పదం కథలో కీలకం. అందుకే పెట్టాం. ఈజీ మనీకోసం ప్రయత్నించే ఓ కుర్రాడు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇందులో నా పాత్ర నలిగిపోతూ, చూసేవాళ్లకు నవ్వు తెప్పిస్తుంది. ఇది కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ.’ అని తెలిపారు.
ఇది కామెడీ సినిమానే తప్ప వైలెంట్ సినిమా కాదని, కుటుంబ సమేతంగా చూసేలా సినిమా ఉంటుందని, సాంకేతికంగా కూడా అన్ని విధాలుగా సినిమా బావుంటుందని రాజ్ తరుణ్ తెలిపారు.