Rahul Dev | రీసెంట్గా ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతికి డిప్రెషన్ కారణమంటూ నెట్టింట పలు వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ముకుల్ సోదరుడు రాహుల్ దేవ్ స్పందించారు. కొంత కాలంగా సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే ముకుల్ చనిపోవడానికి కారణమని అన్నాడు. ఆంగ్ల మీడియాతో మాట్లాడిన రాహుల్ దేవ్.. ముకుల్ వారం రోజులకు పైగా ఐసీయూలో చికిత్స పొందాడు. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడం వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత పూర్తిగా తినడం మానేశాడు.
అది కాక కొంతకాలంగా తీవ్రమైన ఒంటరితనంతో కూడా బాధపడుతున్నాడు. సినిమా అవకాశాలు వస్తున్నప్పటికీ, వాటని కూడా తిరస్కరించాడు. 2019లో తమ తండ్రి మరణం ముకుల్‌ను తీవ్రంగా కుంగదీసిందని రాహుల్ దేవ్ గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత తల్లి మరణం, భార్యతో విడాకులు వంటి వరుస ఘటనలు ముకుల్‌ని ఒంటరి చేశాయని చెప్పుకొచ్చాడు రాహుల్ దేవ్. అయితే ఈ పరిస్థితుల వల్లనే ముకుల్ ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడు. అలవాట్లు కూడా మారిపోయాయి. అతనికి అండగా నిలిచేవారు లేరు, పట్టించుకునేవారు కరువయ్యారు. ముకుల్ మృతిపై ఇప్పడు పలువురు రకరకాలుగా మాట్లాడుతున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదని రాహుల్ వివరణ ఇచ్చాడు.
ఇక 1970 సెప్టెంబర్ 17న న్యూఢిల్లీలో జన్మించిన ముకుల్ దేవ్ 1996లో ‘ముమ్కిన్’ అనే టీవీ సీరీస్‌తో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ఏడాది ‘దస్తక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతను ఆ చిత్రంలో సుష్మితా సేన్‌తో స్క్రీన్ షేర్ చేశారు. ఇక తెలుగులో రవితేజ హీరోగా నటించిన కృష్ణ సినిమాలో విలన్‌గా నటించాడు. ఈ సినిమాలో జక్కా పాత్రలో టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్ చూపించాడు. అలా చాలా ఫేమస్ అయ్యాడు. ఇక రాహుల్ దేవ్.. నాగార్జున హీరోగా నటించిన ఆకాశ వీధిలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. టక్కరి దొంగ సినిమాలో నటించాడు. అందులో మంచి స్కోప్ ఉన్న రోల్ రావడంతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సింహాద్రిలో బాలా నాయర్‌గా, సీతయ్యలో చంద్రనాయుడుగా, ఆంధ్రావాలాలో ధన్రాజుగా, మాస్ సినిమాలో సేషుగా.. ఇలా ప్రతీ సినిమాలో సాలిడ్ రోల్స్ పడ్డాయి.