సంపాదించే ప్రతి పైసాలో కొంత భాగం సేవాకార్యక్రమాలకు వెచ్చించే మంచి బుద్ధి అందరికీ ఉండదు. అలాంటి మంచి మనసు అరుదైన వ్యక్తులకే ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తే నటుడు, డాన్స్ మాస్టర్ లారెన్స్. ఆయన నెలకొల్పిన ట్రస్ట్ వేలాదిమంది జీవితాల్లో వెలుగు నింపింది. అనాథ పిల్లల ఆశ్రయం, ఆహారం, విద్య, సంరక్షణ ఇవన్నీ ఆ ట్రస్ట్ చూస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో తన సొంత ఇంటిని కూడా సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నట్టు లారెన్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోలో లారెన్స్ మాట్లాడుతూ ‘కొత్త సినిమాకు అడ్వాన్స్ తీసుకున్న ప్రతిసారీ ఒక కొత్త సామాజిక కార్యక్రమం ప్రారంభించడం నాకు అలవాటు. ఈ క్రమంలో నా మొదటి ఇంటిని పిల్లల చదువు నిమిత్తం ఉచిత పాఠశాలగా మారుస్తున్నాను.
ఈ విషయాన్ని తెలియజేసేందుకు గర్విస్తున్నా. ఇది డాన్స్ మాస్టర్‌గా నేను సంపాదించిన డబ్బుతో కొన్న తొలి ఇల్లు. అందుకే ఈ ఇల్లు నాకెంతో ప్రత్యేకం. దీన్ని ఓ మంచి కార్యానికి ఉపయోగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా ఇంట్లో పెరిగిన అమ్మాయే ఈ ఉచిత పాఠశాలలో తొలి ఉపాధ్యాయురాలు కానున్నది. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘కాంచన 4’ అధికారికంగా మొదలైంది. అందర్నీ అలరించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతా.’ అని చెప్పుకొచ్చారు లారెన్స్.