తాము నటించిన సినిమాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కితే ఆ తారల సంతోషానికి హద్దులుండవు. అలాంటి ఆనందాన్నే పొందుతున్నది బాలీవుడ్ తార రాధిక మదన్. ఆమె నటించిన సినిమా ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో, ‘కచ్చే లింబు’ టల్లిన్ బ్లాక్ నైట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైంది. యూరప్‌లోని ఎస్తోనియాలో ఈ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. తన గత రెండు సినిమాలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికై గుర్తింపు తీసుకురాగా..ఇప్పుడు రాధిక మదన్ నటించిన ‘సనా’ సినిమా కూడా టల్లిన్ బ్లాక్ నైట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది. దీనిపై రాధిక స్పందిస్తూ… ‘మా పనిని ప్రపంచం గుర్తిస్తున్నది. కష్టానికి తగిన ఫలితమిదని అనుకుంటా.
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రదర్శనకు నేను నటించిన మూడు సినిమాలు వెళ్లడం గౌరవంగా భావిస్తున్నా. నా కొత్త సినిమా ‘సనా’కు ఇక్కడి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే మాటలు రావడం లేదు’ అని చెప్పింది. ఇటీవలే ‘మోనికా ఓ మై డార్లింగ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ తార..‘హ్యాపీ టీచర్స్ డే’, ‘కుత్తే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నది.