Radhika Apte | బాలీవుడ్‌తో పాటు పలు భారతీయ భాషల్లో తన ప్రతిభను చాటి స్టార్ హీరోయిన్గా ఎదిగిన నటి రాధికా ఆప్టే. నిర్భయంగా మాట్లాడే స్వభావంతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లోనూ నటించి అభిమానులను మెప్పించారు. ఎప్పుడూ నిజాయితీగా తన అభిప్రాయాలను పంచుకునే ఆమె, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గర్భధారణ సమయంలో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. నటి నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ఓ చిట్‌చాట్ షోలో రాధికా మాట్లాడుతూ, తాను గర్భవతిగా ఉన్న సమయంలో ఓ హిందీ సినిమా షూటింగ్ చేస్తున్నానని చెప్పారు.
అయితే తాను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటికీ ఆ చిత్ర నిర్మాత ఏమాత్రం మానవత్వం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు నేను మూడో నెల గర్భంతో ఉన్నాను. శరీరంలో మార్పులు వచ్చాయి. కానీ నిర్మాత మాత్రం టైట్ దుస్తులు ధరించమని బలవంతం చేశాడు. నేను అసౌకర్యంగా బాధపడుతున్నా, డాక్టర్ని కలవనివ్వలేదు.నొప్పితో బాధపడుతున్నా కూడా అలానే షూటింగ్ కొనసాగించారు అంటూ తన ఆవేదనను వెల్లడించారు. అదే సమయంలో, తాను పనిచేస్తున్న హాలీవుడ్ సినిమా యూనిట్ తనకు పూర్తి మద్దతుగా నిలిచిందని రాధికా చెప్పుకొచ్చారు. “నేను ఎక్కువగా తింటున్నానని, శరీరం మారిపోతోందని చెప్పినప్పుడు, డైరెక్టర్ నవ్వుతూ .. ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి మీరు ఎలా ఉన్నా సరే పర్వాలేదు, మీరు గర్భవతి అని ఆయన చెప్పిన ఆ మాటలు నాకు ఎంతో భరోసానిచ్చాయి అని చెప్పారు.
నేను ఎప్పుడూ ప్రత్యేక సౌకర్యాలు కోరలేదు. కెరీర్, ప్రొఫెషనల్ నిబద్ధతలు నాకు తెలుసు. కానీ మనిషిగా కొంత జాలి, దయ, సానుభూతి చూపించడం తప్పు కాదు. అలాంటి ఆనందమైన సమయంలో, కనీస మానవత్వం ఉంటే చాలునని నేను అనుకుంటున్నాను అంటూ తన భావాలను చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. రాధికా ఆప్టే తెలుగు ప్రేక్షకులకు ‘రక్త చరిత్ర 2’ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. అనంతరం ‘ధోనీ’, ‘లెజెండ్’, ‘లయన్’, అలాగే డబ్బింగ్ రూపంలో ‘కబాలి’, ‘మేరీ క్రిస్మస్’ వంటి చిత్రాల్లో నటించారు. 2012లో బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ని వివాహం చేసుకున్న రాధికా, 2024 డిసెంబర్లో తన తొలి బిడ్డకు జన్మనిచ్చారు. నటిగా కాకుండా, మహిళగా, తల్లిగా కూడా ఆమె చూపిన ధైర్యం, స్పందించిన తీరు ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తోంది.