తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు శరత్‌కుమార్. 90ల్లో ఆయన నటించిన తమిళ చిత్రాలు ఇక్కడ అనువాదమై అఖండ విజయాలు అందుకున్నాయి. మండే సూర్యుడు, మరో యుద్ధకాండ చిత్రాలు అందుకు ఉదాహరణ. ఇక తమిళంలో ఆయన నటించిన ఎన్నో సూపర్‌హిట్స్ ఇక్కడ పునర్నిర్మించబడ్డాయి. పెదరాయుడు, సూర్యవంశం, స్నేహంకోసం, సింహారాశి, మా అన్నయ్య సినిమాలు ఆ కోవకు చెందినవే. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా శరత్‌కుమార్ సత్తా చాటుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ‘డ్యూడ్’ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం మీడియాతో శరత్‌కుమార్ మాట్లాడారు.
కథలో కీలకంగా ఉండే పాత్రలే చేయాలనేది నా అభిమతం. దర్శకుడు కీర్తిశ్వరన్ ‘డ్యూడ్’ కథ చెప్పినప్పుడు నా పాత్ర నన్ను హంట్ చేసింది. కథలో చాలా క్రూషియల్ క్యారెక్టర్. హీరో ప్రదీప్‌కు అంకుల్‌గా కనిపిస్తా. ఒక కుటుంబంలో ఇలాంటి మేటర్ ఒకటి జరిగితే సొసైటీ ఎలా రియాక్టవుతుందనే కోణంలో ఈ కథ సాగుతుంది. ఇందులో కామెడీ, హ్యూమన్ ఎమోషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అందుకే ఛాలెంజ్‌గా తీసుకొని చేశాను.
ఇది ఎమోషనల్ ఫిల్మ్. ఎంటైర్టెన్మెంట్తో పాటు కంటెంట్ కూడా ఉంటుంది. ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యే సినిమా. ప్రదీప్ ఆల్‌రౌండర్. మంచి దర్శకుడు కూడా. తనకంటూ ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ సినిమాలో తన నటన హై ఎనర్జీతో ఉంటుంది. మమితాబైజుది కూడా చాలా మంచి పాత్ర. సాయి అభ్యంకర్ మంచి సంగీతం ఇచ్చారు. సాంకేతికంగా కూడా సినిమా ఆకట్టుకుంటుంది. మైత్రీ లాంటి గొప్ప సంస్థలో నటించడం పట్ల గర్వంగా ఫీలవుతున్నా.
షాట్ ఓకే అయ్యాక మానిటర్ చూడటం నాకిష్టం ఉండదు. మనపై మనకు నమ్మకం లేకపోతేనే అలా చేస్తాం. ఇప్పడున్న చాలామంది ఆర్టిస్టులు ప్రతిసారీ వెళ్లి మానిటర్ చూస్తున్నారు. ఇదంతా టైమ్‌వేస్ట్ ప్రాసెస్. న్యూ జనరేషన్ డిజిటల్ టెక్నాలజీకి అప్డేట్ అవుతూ సినిమాలు చేస్తున్నారు. వారితో కలిసి పనిచేయడం వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. ఆర్టిస్టుగా మాత్రం నాలో మార్పేమీ లేదు. కొత్త పాత్రలు చేయాలనే తపన అప్పుడూ ఉందీ ఇప్పుడూ ఉంది. సుభాష్ చంద్రబోస్ బయోపిక్ చేయాలనేది నా డ్రీమ్. అలాగే ‘మిస్టర్ ఎక్స్’ అనే సినిమా చేస్తున్నాను. గౌతమ్ మీనన్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నా.