‘పుష్ప-2’ (ది రూల్) చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. తొలి భాగం అపూర్వ విజయాన్ని సొంతం చేసుకోవడం, పుష్పరాజ్ పాత్రకు మాస్ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘పుష్ప..పుష్ప..పుష్పరాజ్..’ అంటూ సాగే తొలి గీతాన్ని బుధవారం విడుదల చేశారు.
‘నువ్ గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే, నువ్ భుజమే ఎత్తి నడిసొస్తుంటే భూమి బద్దలయ్యే, నువ్ నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే..’ అంటూ పుష్పరాజ్ ఆటిట్యూడ్‌ను తెలియజేస్తూ, అతనిలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పాట ఆకట్టుకుంది. దేవిశ్రీప్రసాద్ ట్యూన్, చంద్రబోస్ రచన ప్రధానాకర్షణగా ఈ పాట విజువల్ ట్రీట్‌లా సాగింది. ఈ గీతానికి విజయ్ పొల్లంకి, శ్రేష్టి వర్మ నృత్యరీతులను సమకూర్చారు. రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబో బ్రోజెక్, సంగీ తం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, కథ, కథనం, దర్శకత్వం: సుకుమార్.బి.