Puri Jagannadh New Podcast | అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కొత్త పాడ్ కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పూరి మ్యూజింగ్స్ (Puri Musings) అనే పేరుతో పూరి తన భావాలను వివిధ అంశాలపై మాట్లాడుతుంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ విషయాలను యూట్యూబ్ వేదికగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు. దీనికి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణ ఉంది. తాజాగా బిలియనీర్లు (Billionaires) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
కాసేపు అదృష్టవంతుల గురించి మాట్లాడుకుందాం. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు ఓ 3 వేల మంది బిలియనర్స్ ఉన్నారు. వాళ్లందరి ఆస్తి కలిపితే ఎన్నో ట్రిలియన్ డాలర్స్ ఉంటుంది. ప్రపంచంలో ఉన్న సంపదంతా ఈ 3 వేల మంది దగ్గరే ఉంది. ఇందులో ఎక్కువ మంది బిలియనీర్స్ ఇండస్ట్రీలు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, టెక్నాలజీ తదితర రంగాల నుంచి వచ్చారు. ఇందులో 67 శాతం మంది బిలియనీర్లు ఎవరికి వారే కష్టపడి పైకి వచ్చిన వాళ్లు ఉన్నారు. మిగిలిన వాళ్లందరూ వారసత్వంగా పొందినవారు ఉన్నారు.
2023లో అతి పిన్న వయస్కుడైన సెల్ఫ్ మేడ్ బిలియనీర్ అలెగ్జాండర్ వాంగ్. ఈ కుర్రాడు 20 ఏండ్లకే బిలియనీర్ అయిపోయాడు. అలాగే కాయిలీ జెర్నర్ ఆ అమ్మాయి కూడా ఇలా చిన్న వయసులో బిలియనర్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్స్‌లో ఆడోళ్ళు 10% ఉన్నారు. న్యూయార్క్ హాంగ్‌కాంగ్, మాస్కో, ముంబై, వీటిని బిలియనర్ సిటీస్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ మంది బిలియనర్స్ ఉన్నారు. చాలా మంది ధనవంతులు చారిటీ కోసం వాళ్ల సగం కంటే ఎక్కువ ఆస్తిని దానం చేసినవాళ్లు ఉన్నారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ అయితే వాళ్ల 50 శాతం ఆస్తిని దానం చేశారు.
అపర కుబేరులైన ఎలాన్ మస్క్ (ఎక్స్ అధినేత), జెఫ్ బెజోస్ (అమెజాన్ అధినేత), రిచర్డ్ బ్రాన్సన్(వర్జిన్ గ్రూప్) వీళ్లంతా అంతరిక్షం యాత్రలకు సంబంధించి ఎక్కువ పరిశోధనలు చేస్తున్నారు. ఏదో రోజు స్పేస్ ట్రావెల్ అందుబాటులో తేవాలని వాళ్లు కృషి చేస్తున్నారు. ఇలా ప్రతి బిలియనీర్‌కి ఒక విజన్ ఉంది దాని కోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఇదంతా బిలియనర్స్ గురించి ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది ఏంటంటే ఈ మూడు వేల మంది ధనవంతులందరూ దేవుడి ముద్దు పిల్లలు. స్పెషల్ కిడ్స్. మనం రోజు ఉదయం లేచి దేవుడికి మొక్కుకుంటాం. వాళ్ళలాగే వేల, లక్షల కోట్ల ఆస్తి కావాలని. వాళ్ళలాగే బిలియనర్ అవ్వాలని మరి దేవుడు వాళ్ళకి అన్ని ఇచ్చాడు అయినా సరే వాళ్ళు మనకంటే ఎక్కువగా దేవుడిని మొక్కుతారు. వాళ్లు దేవుడిని ఇంకా ఏం కావాలని కోరుకుంటారో తెలుసా ఆరోగ్యం(Health).
ప్రపంచంలో ప్రతి బిలియనర్ దేవుడిని కోరుకున్నది ఒకటే ఆరోగ్యం. తనకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని. వయసు మీద పడుతున్న బిలియనర్స్ అందరూ ఒక్కో రోజు తరిగిపోతుంటే భయపడుతూ బ్రతుకుతారు. ప్రతి గంటకి వాళ్ళ బ్యాంకుల్లో డబ్బు వచ్చి పడుతూ ఉంటది. ఎందుకంటే ఒక్క రోజుకి వాళ్ల సంపాదన రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఉంటుంది. అందుకే వాళ్ళ జీవితంలో కరిగిపోతున్న ప్రతి గంట వాళ్ళకి తెలుస్తు ఉంటుంది. ఆయుష్షు ఎలాగో పెరగదు కనీసం బతికినన్ని రోజులైన ఆరోగ్యంగా బతకాలి మంచానికి పడకుండా పోవాలి అదే వాళ్ల కోరిక. మన కోరిక కూడా.
అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం జీవితంలో ఏం సాధించిన సాధించకపోయినా కావాల్సింది ఆరోగ్యం. ఏదో రోజు దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దాడుతాడు. అప్పటికి మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. అనుభవించడానికైనా ఆరోగ్యం కావాలి ఎండల్లో అడుక్కోవడానికి కూడా ఎంతో కొంత ఆరోగ్యం కావాలి అంటూ పూరి చెప్పుకోచ్చాడు.