Varinder Ghuman | ప్రముఖ బాడీబిల్డర్, పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయసు 42 సంవత్సరాలు మాత్రమే. బలమైన శరీర నిర్మాణంతో కనిపించే ఘుమాన్ మరణ వార్తపై అభిమానులు, సినీ పరిశ్రమ, రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. వరీందర్ ఘుమాన్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘టైగర్ 3’ (2023) లో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఆయన ‘రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్బన్స్’ (2014), ‘మర్జావాన్’ (2019) చిత్రాల్లోనూ నటించారు. అలాగే 2012లో పంజాబీ సినిమా ‘కబడ్డీ వన్స్ ఎగైన్’ లో నటించి ప్రాంతీయంగా పేరు తెచ్చుకున్నారు.
6 అడుగుల 2 అంగుళాల ఎత్తుతో ఘుమాన్ శరీరదారుఢ్యానికి మారుపేరుగా నిలిచారు. ముఖ్యంగా ఆయన శాఖాహారం తింటూ బాడీబిల్డర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆయన, మిస్టర్ ఆసియా పోటీలో రన్నరప్ స్థానం సాధించారు. ఆయన ఫిట్నెస్ పట్ల ఉన్న ప్రేమ అంతులేనిది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యాయామ వీడియోలను తరచుగా షేర్ చేస్తూ యువతలో ఉత్సాహాన్ని నింపేవారు. వరీందర్కి ఇటీవల భుజం నొప్పి ఉండగా, చికిత్స కోసం అమృత్‌సర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మేనేజర్ యద్వీందర్ సింగ్ ధృవీకరించారు. మేనల్లుడు అమంజోత్ సింగ్ ఘుమాన్ మాట్లాడుతూ, మృతికి ముందు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
వరీందర్ ఘుమాన్ జీవితంలో మరో కోణం ఏమిటంటే, ఆయన 2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశంపై ఆలోచన చేస్తున్నారు. అయితే ఈ కోరిక తీరకుండానే ఆయన జీవిత ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది.వరీందర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుఖ్జిందర్ సింగ్ రంధావా (పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి).. వరీందర్ ఘుమాన్ జీ ఆకస్మిక మరణం అత్యంత బాధాకరం. ఆయన కృషి, క్రమశిక్షణతో పంజాబ్ పేరును ప్రపంచానికి తెలియజేశారు అంటూ సంతాపం తెలియజేశారు. గురుదాస్‌పూర్‌కు చెందిన ఘుమాన్, ప్రస్తుతం జలంధర్‌లో నివాసం ఉంటూ అక్కడే తన జిమ్ నడుపుతున్నారు. ఆయన అభిమానులు, బాడీబిల్డింగ్ ప్రేమికులు, ఫిట్నెస్ కమ్యూనిటీ అతని మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. వరీందర్ ఘుమాన్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ప్రేరణాత్మక జీవితం, అహింసా జీవనశైలి, దృఢమైన సంకల్పం ఇవన్నీ ఈ తరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయి.