ప్రపంచ సినీచరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఒకేసారి 15 సినిమాలకు శ్రీకారం చుట్టారు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. చిత్రపరిశ్రమ ప్రముఖులు పాల్గొనగా.. హైదరాబాద్ సారధీ స్టూడియోలో ఈ వేడుక ఘనంగా జరిగింది. 15 సినిమాలకు 15 కెమెరాలతో 45మంది సినీ ప్రముఖులు క్లాప్, స్విచాన్, గౌరవ దర్శకత్వం వహించడం విశేషం. ఒకేసారి 15 సినిమాలను మొదలుపెట్టడం ప్రపంచ రికార్డనీ, ఇది అందరికీ సాధ్యం కాదని పలువురు సినీ ప్రముఖులు నిర్మాత రామసత్యనారాయణను అభినందించారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15కల్లా 15 సినిమాలూ పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు.
యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘జస్టిస్ ధర్మ’, ఓం సాయిప్రకాశ్ దర్శకత్వంలో ‘నాగపంచమి’, జె.కె.భారవి దర్శకత్వంలో ‘నా పేరు పవన్‌కల్యాణ్’, ఉదయ్‌భాస్కర్ దర్శకత్వంలో ‘టాపర్’, తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో ‘కె.పి.హెచ్.బి.కాలనీ’, సంగంకుమార్ దర్శకత్వంలో ‘పోలీస్ సింహం’, శ్రీరాజ్ బళ్లా దర్శకత్వంలో ‘అవంతిక-2’, రవి బసర దర్శకత్వంలో ‘యండమూరి కథలు’, మోహన్‌కాంత్ దర్శకత్వంలో ‘బి.సి -బ్లాక్ కమాండో’, హర్ష దర్శకత్వంలో ‘హనీకిడ్స్’, ఏకరి సత్యనారాయణ దర్శకత్వంలో ‘సావాసం’, కృష్ణ కార్తీక్ దర్శకత్వంలో ‘డార్క్ స్టోరీస్’, బి.శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘మనల్ని ఎవడ్రా ఆపేది’, ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకత్వంలో ‘ది ఫైనల్ కాల్’, డా.సతీష్ దర్శకత్వంలో ‘అవతారం’.. చిత్రాల ప్రారంభోత్సవాలు ఈ రోజు జరిగాయి.