‘ఈ కథ వినగానే నాకూ బాగా నచ్చింది. ఇందులో హీరో పాత్ర పేరు కుమార్. ఆ క్యారెక్టరైజేషన్ నన్ను ఆకట్టుకుంది. ముందుగా ఈ సినిమాకు ‘కుమార్ ర్యాంప్’ అనే టైటిల్ అనుకున్నాం. అది కాస్త లెన్తీగా ఉందని ‘కె-ర్యాంప్’ అని ఫిక్స్ చేశాం. కొందరికి ఇది బూతులా అనిపించొచ్చు. అది వారి దృక్కోణం. కిరణ్ హిట్ సినిమా ‘క’కు తొలి అక్షరం ‘K’ కాబట్టి అది కూడా సెంటిమెంట్‌గా భావించాం.’ అని నిర్మాత రాజేశ్ దండా అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా జైన్స్ నాని దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘కె-ర్యాంప్’ చిత్రం ఈ నెల 18న విడుదల కానున్నది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించిన ఆయన.. పై విధంగా స్పందించారు.
‘ ‘కె-ర్యాంప్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు మూడువేల మందికి పైగా రావడంతో సర్ప్రైజ్ అయ్యాను. నేను స్వతహాగా బాలకృష్ణగారి అభిమానిని. ఆ జనాన్ని చూసిన హై లో బాలయ్యలా తొడగొట్టి సినిమా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పాను. అది బాగా వైరల్ అయ్యింది. మా సంస్థలో సినిమా మొదలుపెట్టిన ఆరు నెలల్లో విడుదలవుతున్న సినిమా ఇదే. దర్శకుడు, హీరో ముందే ప్రిపేర్ అయి ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.’ అని తెలిపారు రాజేశ్ దండా.
కథ డిమాండ్ మేరకే కేరళలో షూట్ చేశామని, కథలో హీరోయిన్ కేరళ అమ్మాయి కావడంతో అక్కడి కాలేజ్ సీన్స్, ఓనమ్ సాంగ్ విజువల్స్ కలర్ఫుల్గా వచ్చాయని రాజేశ్ చెప్పారు. సినిమాకు సెన్సార్ ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినా.. అందరూ చూసేలా సినిమా ఉంటుందని, కిరణ్ అబ్బవరం నిర్మాతల హీరో అని, ఆయనతో వరుసగా సినిమాలు చేయాలనుందని, చేతన్ భరద్వాజ్ బెస్ట్ మ్యూజిక్ అందించారని, ముఖ్యంగా బీజీఎం ఈ సినిమాకు హైలైట్ అనీ, ఇంటర్వెల్ అయితే సర్ప్రైజ్ చేస్తుందనీ, ఈ దీపావళికి ఇది సరైన సినిమా అనీ రాజేశ్ దండా పేర్కొన్నారు.