‘ఈ కథ వినగానే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తొచ్చేది. నరేష్ డేట్స్ కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా తీశా’ అన్నారు నిర్మాత రాజేష్ దండా. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి చిత్రాలతో ఆయన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అల్లరి నరేష్ కథానాయకుడిగా సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ‘బచ్చలమల్లి’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ దండా మాట్లాడుతూ ‘1980 దశకంలో కథ నడుస్తుంది. బచ్చలమల్లి అనే వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని తయారుచేసిన ఫిక్షనల్ స్టోరీ ఇది. సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే జీవితంలో ఎలాంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సివస్తుందనే అంశాలను చూపించాం’ అన్నారు. ఓ ప్రేక్షకుడిలా తాను కథలు వింటానని, ఒకే మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేయాలన్నదే తన లక్ష్యమని రాజేష్ దండా తెలిపారు. ఇప్పటివరకు నరేష్‌తో సీరియస్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశానని, భవిష్యత్తులో ఆయనతో ఫుల్‌లెంగ్త్ కామెడీ మూవీ తీసే ఆలోచన ఉందని ఆయన చెప్పారు.