‘జటాధర అద్భుతమైన సబ్జెక్ట్. ఎమోషన్స్‌తోపాటు సూపర్ నాచురల్, మైథలాజికల్ ఎలిమెంట్స్ మిళితమైన కథ ఇది. పానిండియా కంటెంట్ కాబట్టే హిందీలో కూడా చేశాం. విజువల్‌గా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.’ అని నిర్మాత ప్రేరణ అరోరా అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో రూపొందిన సూపర్ నాచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకులు. ఉమేశ్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింగ్హాల్, నిఖిల్ నందాలతో కలిసి ప్రేరణ అరోరా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 7న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా ప్రేరణ అరోరా మంగళవారం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘సుధీర్‌బాబు, దర్శకులు వెంకట్, అభిషేక్‌ల ద్వారా తొలిసారి ‘జటాధర’ కథ విన్నాను. అప్పట్నుంచీ ఈ ప్రయాణం మొదలైంది. సుధీర్‌బాబు పాషన్‌తో ఈ సినిమా చేశారు. ఇందులో ఛాలెంజింగ్‌గా అనిపించే చాలా సీన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ స్పోర్టీవ్‌గా చేశారు. ఈ సినిమాను హిందీలో కూడా చేయాలనుకున్నప్పుడు సోనాక్షిని కలిశాను. తను అద్భుతమైన నటి. ధనపిశాచి పాత్రకు సోనాక్షి పర్ఫెక్ట్. ఆమె కూడా చెప్పగానే అంగీకరించారు. ఆమె కెరీర్లో నిలిచిపోయే పాత్ర అవుతుంది. సుధీర్, సోనాక్షి కాంబినేషన్లో హెవీ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.
అవన్నీ ప్రేక్షకుల్ని అలరిస్తాయి.’ అని చెప్పారు ప్రేరణ అరోరా. అనంత పద్మనాభస్వామి దేవాలయం, నాగబంధం తదితర అంశాల ప్రేరణ ఈ కథలో ఉంటుందని, ధనపిశాచికి చెందిన ఎలిమెంట్స్ ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేస్తాయని, బ్లాక్ మ్యాజిక్, డివైన్ లాంటి ఎక్సైటింగ్ ఎలిమెంట్స్ కథలో ఉంటాయని, 60శాతం లైవ్ విజువల్స్, 40శాతం వీఎఫ్ఎక్స్తో జనం మెచ్చేలా సినిమాను తెరకెక్కించామని, సీజీ వర్క్ నాచురల్ ఫీల్ కలిగిస్తుందని ప్రేరణ తెలిపారు. శిల్పా శిరోద్కర్ది అద్భుతమైన పాత్ర అనీ, ఈ సినిమాకు కొనసాగింపు కూడా ఉంటుందని, పెద్ద హీరోతో మరో తెలుగు సినిమా చేయబోతున్నామని, ఆ వివరాలు త్వరలో ప్రకటిస్తామని ప్రేరణ అరోరా చెప్పారు.