‘ది గర్ల్‌ఫ్రెండ్’ మహిళా ప్రధాన చిత్రం కాదు. హృదయాన్ని కదిలించే చక్కటి ప్రేమకథ. సెన్సార్‌వాళ్లు కూడా ఈ కథకు జాతీయ అవార్డు దక్కే అవకాశముందని మెచ్చుకున్నారు’ అని చిత్ర నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి అన్నారు. రష్మిక మందన్న, దీక్షిత్‌శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాతలిద్దరూ విలేకరులతో ముచ్చటించారు. ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ ‘కథానాయిక దృక్కోణంలో ఈ కథ నడుస్తుంది. అందుకే రష్మిక మందన్న జోడీగా స్టార్‌హీరోను కాకుండా మంచి పర్ఫార్మర్ అయిన దీక్షిత్శెట్టిని తీసుకున్నాం. కోవిడ్ తర్వాత ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే కథలో దమ్ముండాలి. కథ ఉద్వేగానికి గురిచేయాలి.
‘ది గర్ల్‌ఫ్రెండ్’ అలాంటి కథనే. ఈ సినిమా విషయంలో మాకు ఎలాంటి ఒత్తిడి లేదు. రిలీజ్‌కు ముందే రిలాక్స్‌గా ఉన్నాం. మేం అనుకున్నట్లుగా సినిమా వచ్చింది కాబట్టి విజయంపై ధీమాగా ఉన్నాం’ అన్నారు. ప్రొడక్షన్ విషయంలో తాము సమిష్టి నిర్ణయాలు తీసుకుంటామని, అల్లు అరవింద్‌గారి సూచనలతో ముందుకెళ్తామని విద్య కొప్పినీడి అన్నారు.
ఆమె మాట్లాడుతూ ‘కాలేజీ నేపథ్యంలో సాగే హృద్యమైన ప్రేమకథ ఇది. ప్రతీ ఒక్కరికి తమ ప్రేమకథలను గుర్తుచేస్తుంది. రష్మిక పాన్ఇండియా ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రొడక్షన్ అంత ఈజీ కాదు. అందుకే సినిమాల ఎంపిక విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు.