Bunny Vasu | ‘మలయాళ భాషలో కథలు చాలా సహజంగా ఉంటాయని చెబుతారు. నేటివిటీకి వాళ్లు పెద్ద పీట వేస్తారు. అలాంటి కథలతో మనమెందుకు సినిమాలు చేయకూడదనుకున్నా. అదే సమయంలో ‘ఆయ్’ కథ నా దగ్గరకు వచ్చింది’ అన్నారు నిర్మాత బన్నీ వాస్. జీఏ2 పతాకంపై నార్నే నితిన్ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘ఆయ్’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం బన్నీ వాస్ పాత్రికేయులతో పంచుకున్న విశేషాలు..
ఈ సినిమా కథ విన్నప్పుడు రెండున్నర గంటలు నాన్‌స్టాప్‌గా నవ్వుకున్నా. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అదేరీతిలో సినిమాను ఎంజాయ్ చేస్తన్నారు. దర్శకుడు అంజి కే మణిపుత్రది అమలాపురం దగ్గరలోని ఓ చిన్నపల్లెటూరు. అందుకే కథను అందులోని పాత్రలను చాలా సహజంగా తీర్చిదిద్దాడు. కోనసీమ అందాలను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చాడు
వర్షంలో కోనసీమ మరింత అందంగా కనిపిస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు వర్షం తాలూకు అనుభూతి చెందాలని షూటింగ్ అంతా వర్షాకాలంలో ప్లాన్ చేశాం. మబ్బుపట్టినప్పుడే షూటింగ్‌కు వెళ్లేవాళ్లం. ఎండకొడితే షూటింగ్‌ను వాయిదే వేశాం. వర్షాన్ని ఈ కథలో ఓ భాగంగా భావించాం. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యమైంది.
కరోనా కంటే ముందే ఈ కథను ఓకే చేశాను. ఈ సినిమా కోసం టీమ్ మొత్తం చాలా ఎఫర్ట్స్ పెట్టాం. ఈ సినిమా యూత్‌తో పాటు ప్రతి ఒక్కరికి కనెక్ట్ కావాలనుకున్నాం. అందుకే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్‌కు కూడా సమప్రాధాన్యతనిచ్చాం. నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజాయ్ చేశానో ..సినిమా చూస్తున్న ప్రేక్షకులు కూడా అలాగే ఎంజాయ్ చేస్తున్నారు.
హీరో నితిన్ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. తనలోని టాలెంట్ ఏమిటో ఆయనకు బాగా తెలుసు. కథల విషయంలో ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. సినిమాకొస్తున్న ఆదరణ దృష్ట్యా షోస్ పెంచాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మేము కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాం. ఒకటిరెండు రోజుల్లో షోస్ పెంచుతాం.
నేను జీవితంలో బంధుత్వం కంటే స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. జీవితంలో ఈ స్థాయికి వచ్చానంటే స్నేహితులే కారణం. బన్నీగారితో పాటు చాలా మంది స్నేహితులు ప్రోత్సాహంతో సక్సెస్ అయ్యాను. అందుకే ఫ్రెండ్షిప్ నేపథ్యంలోని ‘ఆయ్’ కథకు వెంటనే కనెక్ట్ అయ్యాను. చిన్న సినిమా తీసి పెద్ద సక్సెస్ కొట్టినప్పుడు కిక్ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం మా బ్యానర్లో ‘తండేల్’ షూటింగ్ జరుగుతున్నది. డిసెంబర్లో రిలీజ్ అనుకుంటున్నాం. అదే నెలలో ‘పుష్ప-2’కూడా రాబోతున్నది.