థియేటర్లలో విడుదలైన నెలలోపే సినిమాలను ఓటీటీలోకి స్ట్రీమింగ్కు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడే ప్రమాదం ఉందని నిర్మాత బన్నీ వాసు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానంపై కాకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి, ఆక్యుపెన్సీ పెంచే దిశగా కృషి చేయాలని కోరారు.
ఈ మేరకు శుక్రవారం ఆయన తన సోషల్మీడియా ఖాతాల్లో ఓ పోస్ట్పెట్టారు. ‘ఇప్పుడున్న అర్ధ రుపాయి బిజినెస్లో నీది పావలా, నాది పావలా అని కొట్టుకోవడం కాదు. గతంలో మాదిరిగా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలనేది ఆలోచించాలి. సినిమా రిలీజైన 28రోజుల్లోపే ఓటీటీకి ఇవ్వాలనే ట్రెండ్ కొనసాగితే రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో 90శాతం సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడతాయి.
పెద్ద హీరోలు రెండుమూడు సంవత్సరాలకో సినిమా చేస్తూ పోతే థియేటర్ల నుంచి ప్రేక్షకులు దూరమైపోతారు. వాటి యజమానులు కూడా థియేటర్లను మూసేస్తారు. మల్టీఫ్లెక్స్ థియేటర్ల ద్వారా వచ్చే ఆదాయంలో కేవలం 43 శాతం మాత్రమే నిర్మాతలకు వెళ్తుంది. ఈ విషయాన్ని పెద్ద హీరోలు గుర్తుంచుకోవాలి’ అని బన్నీ వాసు పేర్కొన్నారు.