‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతో నిర్మాతగా ప్రస్థానం మొదలుపెట్టి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు బెక్కెం వేణుగోపాల్. నేడు ఈ నిర్మాత పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ‘2006లో అక్టోబర్ 12న నిర్మాతగా నా తొలిచిత్రం విడుదలైంది. మొదటి చిత్రం ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ చిత్రంతోనే తొలిసక్సెస్‌ను అందుకున్నాను. అక్కడి నుంచి 16 సంవత్సరాలు గడిచిపోయింది. సినిమా తప్ప వేరే వ్యాపకం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నాను. నిర్మాతగా 12 సినిమాలు, వేరే బ్యానర్లతో కలిసి 4 సినిమాలు నిర్మించాను. డబ్బుల కంటే విలువైన అనుభవం సినీ పరిశ్రమలో సంపాందించాను. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కథ కంటే కాంబినేషన్ నమ్ముకుని ఎక్కువ సినిమాలు చేస్తున్నారు నిర్మాతలు. దాని వల్ల సినిమా సూపర్‌హిట్ అయినా లాభాలు రావడం లేదు. ప్రస్తుతం కొత్తవాళ్లతో రోటి, కపడ, రొమాన్స్ అనే సినిమాతో పాటు నిర్మాత చంద్రశేఖర్ రెడ్డితో కలిసి సుడిగాలి సుధీర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. పాగల్ సినిమా దర్శకుడు నరేష్ ఈ సినిమాను రూపొందిస్తారు. వీటితో పాటు ఓటీటీ కోసం అవికాగోర్ ప్రధాన పాత్రలో స్వరూప్ దర్శకత్వంలో ఓ క్రేజీ థ్రిల్లర్ చేస్తున్నాను. అందరూ సర్ప్రైజ్గా ఫీలయ్యే థ్రిల్లర్ ఇది’అన్నారు.