Allu Aravind | సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ జేఏసీకి చెందిన పలువురు నాయకులు విధ్వంసం సృష్టించారు. ఇంటి ప్రహరీ గోడ దూకి.. ఇంటి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ అంటూ నినదించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని.. స్టేషన్కు తరలించారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ మా ఇంటి ముందు జరిగిన ఘటన అందరూ చూశారన్నారు. తాము సంయమనం పాటించాల్సిన సమయమని.. అందుకే అదే పాటిస్తున్నామన్నారు. ఇంటికి జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చారని.. దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఎవరైనా గొడవ చేయడానికి వస్తే పోలీసులు తీసుకెళ్లడానికి సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. ఎవరూ ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించకూడదని.. ఇలాంటి ఘటన ఎవరికీ జరుగకూడదన్నారు. తొందరపడి ఎలాంటి చర్యలకు దిగొద్దని.. దయచేసి అర్థం చేసుకోవాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.