‘హీరోయిన్ కావడం నా చిన్ననాటి కల. ప్రయత్నిస్తున్నప్పుడు స్థాయిని మించి ఆశిస్తున్నానా?! అనే మీమాంస మనసులో ఉండేది. కానీ నిజంగానే హీరోయిన్ని అయ్యాను. విజయాలు అందుకున్నా. ఇదంతా గాడ్ గిఫ్ట్.’ అంటున్నది తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. రీసెంట్ హిట్ ‘మ్యాడ్ స్కేర్’లో ఓ ముఖ్య భూమిక పోషించింది ఈ ముద్దుగుమ్మ. ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఇటీవల మీడియాతో మాట్లాడింది ప్రియాంక. ‘హీరోయిన్ అవ్వాలనే నా కోరిక ఇంట్లోవాళ్లకు కూడా తెలుసు.
ఈ విషయంలో వాళ్లు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అందుకని ప్రత్యేకించి ప్రోత్సహించిందీ లేదు. నేనే సొంతంగా మోడలింగ్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉండేదాన్ని. అనుకోకుండా ‘ట్యాక్సీవాలా’ ఆఫర్ వచ్చింది. అయినా నాకు నమ్మకం లేదు. అందుకే.. ఇంట్లోవాళ్లకు చెప్పలేదు. ఎందుకంటే.. సినీరంగంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఉన్నట్టుంది నన్ను తీసేసి, ఇంకో హీరోయిన్ని పెట్టేయొచ్చు.
అందుకే.. ఇంట్లో చెప్పలేదు. ఒక షెడ్యూల్ అయిన తర్వాత, అప్పుడు చెప్పాను. గీతా ఆర్ట్స్ లాంటి గొప్ప సంస్థ నిర్మిస్తున్న సినిమాతో హీరోయిన్ కావడం పట్ల ఇంట్లో వాళ్లు కూడా ఆనందం వెలిబుచ్చారు. దానికి తగ్గట్టే సినిమా కూడా హిట్ అయ్యింది.’ అంటూ గతాన్ని నెమరువేసుకున్నది ప్రియాంక జువాల్కర్.