Priyanka Jawalkar | టాలీవుడ్లో తెలుగమ్మాయిలు సక్సెస్ సాధించడం చాలా అరుదు. కానీ ప్రియాంక జవాల్కర్ తొలి సినిమా ‘టాక్సీవాలా’తోనే హిట్ కొట్టేసి, లక్కీ హీరోయిన్ అనిపించుకుంది. చూడ్డానికి నార్త్ అమ్మాయిలా ఉండటం కూడా ప్రియాంకకు కలిసొచ్చిందని చెప్పాలి. రెండో సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో ద్వితీయ విఘ్నాన్ని కూడా దాటేసింది. హిట్టయిన రెండూ చిన్న సినిమాలే కావడంతో ప్రియాంకకు అవకాశాలు పెద్దగా రాలేదు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ అందాలభామ బంపర్ఆఫర్ కొట్టేసిందని తెలుస్తున్నది. ‘టిల్లు స్కేర్’లో క్షణకాలం మెరిసిన ప్రియాంక, ‘టిల్లు క్యూబ్’లో రాధిక 3.0గా కనిపించనుందని ఇన్సైడ్ టాక్.
‘డీజే టిల్లు’లో రాధికగా నేహాశెట్టి నటించింది. ప్రస్తుతం అందరూ ఆమె పేరును మర్చిపోయి, రాధిక అనే పిలుస్తున్నారు. ‘టిల్లు స్కేర్’లో కథానాయిక లిల్లీగా అనుపమాపరమేశ్వరన్ నటించినా, ఆమెను అందరూ రాధిక 2.0 అనే పిలుస్తున్నారు. ఇప్పుడు ‘టిల్లూ క్యూబ్’లో ప్రియాంక జవాల్కర్ నటించనున్నట్టు వార్తలు బలంగానే వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ ముద్దుగుమ్మ కూడా రాధిక 3.0గా మారిపోవడం ఖాయం. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ వేరే సినిమా పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ‘టిల్లూ క్యూబ్’ ఉంటుందని తెలుస్తున్నది.