Priyanka Chopra | గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా మళ్లీ భారత్‌లో అడుగుపెట్టి అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఇటలీలో జరిగిన బివిల్గారి ఈవెంట్లో మెరిసిన తర్వాత, తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించిన ఆమె క్యాజువల్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. శాటిన్ సిల్వర్ షర్ట్, బ్లూ జీన్స్‌లో స్టైలిష్‌గా కనిపించిన ప్రియాంక, అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, ఫోటోగ్రాఫర్లకు సంతోషంగా అభివాదం చేసింది. ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రియాంక తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. అమృత్సర్ వైపు ప్రయాణిస్తున్న మ్యాప్‌ను పంచుకుంటూ “చలో, మరో అడ్వెంచర్” అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే ఈ ట్రిప్ వ్యక్తిగతమా, లేక సినిమా షూటింగ్ కోసమా అన్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.
ఇదిలా ఉంటే, చాలా కాలం తర్వాత ప్రియాంక మళ్లీ ఇండియన్ సినిమాలో నటిస్తుండటం విశేషంగా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘వారణాసి’లో ఆమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపించనుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. టైమ్ ట్రావెల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు రాముడి అవతారంలో కనిపిస్తారన్న వార్తలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక తాజా భారత్ పర్యటన కూడా ‘వారణాసి’ షూటింగ్ కోసమే అయి ఉంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
సుమారు ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రియాంక మళ్లీ ఇండియన్ సినిమాలో కనిపించబోతుండటంతో అభిమానులు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కావొచ్చని సమాచారం. మరోవైపు, ప్రియాంక నటించిన పైరేట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది బ్లఫ్’ ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. ప్రముఖ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే ఆమె నటించిన పాపులర్ సిరీస్ ‘సిటాడెల్’ సీజన్ 2 కూడా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.