నిరంతరం ఎదగాలని కోరుకునే తత్వమే తనను హాలీవుడ్ నాయికను చేసిందని చెబుతున్నది కథానాయిక ప్రియాంకా చోప్రా. తాను బాలీవుడ్ కెరీర్‌తో సంతృప్తి పడి ఉంటే ఇంగ్లీష్ సినిమాల దాకా వచ్చే అవకాశం ఉండేది కాదని చెప్పింది. ‘బేవాచ్’ సినిమాతో హాలీవుడ్లో అడుగుపెట్టింది ప్రియాంక. ఇక అప్పటి నుంచి అక్కడి కెరీర్ మీదే పూర్తి దృష్టి సారించింది. అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లో నటిస్తున్నది. తన కెరీర్ గురించి తాజాగా ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ…‘దక్కిన దానితో సంతృప్తి పడటం నాకు అలవాటు లేదు. నేనొక కార్యసాధకురాలిని.
అందుకే నిత్యం జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నిస్తుంటా. బాలీవుడ్లో ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించాను, ఎంతోమంది స్టార్స్‌తో సినిమాలు చేశాను..అయినా ఒక కొత్త తారలా హాలీవుడ్‌కు వచ్చాను. గత పదేళ్లుగా ఇక్కడా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు నచ్చిన ఇంగ్లీష్ సినిమాలు చేసే స్థాయికి చేరాను. బాలీవుడ్లాగే ఆంగ్ల చిత్రాల్లోనూ పేరు తెచ్చుకుంటాననే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం ఆమె హాలీవుడ్లో ‘ఇట్సాల్ కమింగ్ బ్యాక్ టు మీ’ అనే సినిమాతో పాటు ‘సిటాడెల్’ అనే సిరీస్‌లో నటిస్తున్నది.