Priyanka Chopra | ప్రపంచ వేదికలపై భారతీయులు సత్తా చాటుతుంటే గర్వపడాల్సిన సమయంలో, వారినే తక్కువ చేయాలనే ధోరణి ఎంతవరకు సమంజసం అనే చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది బాలీవుడ్ స్టార్ నుంచి గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా. ఇటీవల మిలన్లో జరిగిన ప్రతిష్టాత్మక బల్గారీ జ్యువెలరీ ఈవెంట్లో ప్రియాంక తన స్టైల్, గ్రేస్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఆ వేడుకలో తీసిన ఒక వీడియోను ఆధారంగా చేసుకుని, హాలీవుడ్ పాప్ స్టార్ దువా లిపా ఆమెను పట్టించుకోలేదంటూ కొందరు నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.
ఈ ట్రోలింగ్‌పై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విశ్వాస్ వర్మ తీవ్రంగా స్పందించారు. “ఒక భారతీయుడు విదేశాల్లో విజయాన్ని సాధిస్తే మనం ప్రోత్సహించాలి. కానీ మనవాళ్లే ప్రియాంక స్థాయిని ప్రశ్నిస్తూ విమర్శించడం బాధాకరం” అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రియాంక ఫొటోలు, వీడియోలను వాడుకుని మిలియన్ల వ్యూస్ సంపాదించే పాపరాజీ పేజీలు కూడా ఆమెను అవమానించే విధంగా పోస్టులు చేయడం “విషపూరితమైన మనస్తత్వం”కి నిదర్శనమని ఆయన విమర్శించారు. విశ్వాస్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఈ వీడియోను ప్రియాంక చోప్రా స్వయంగా లైక్ చేయడం గమనార్హం. అలాగే ప్రముఖ నటి రవీనా టాండన్, హర్లీన్ సేథి కూడా ఈ వీడియోకు మద్దతు తెలపడం ద్వారా ట్రోలింగ్‌కు వ్యతిరేకంగా నిలిచారు.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం బల్గారీ బ్రాండ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఉన్నారు. అంటే ఆమె కేవలం ఈవెంట్‌కు హాజరైన అతిథి మాత్రమే కాదు, ఆ బ్రాండ్‌కు ముఖచిత్రం. అదే వేదికపై అన్నా హతావే, జేక్ గిలెన్హాల్ వంటి హాలీవుడ్ అగ్ర తారల సరసన సమాన హోదాలో నిలిచారు. ఇలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని గుర్తింపు లేని వ్యక్తి గా చూపించే ప్రయత్నాలు ఆమె సాధించిన విజయాలను అవమానించడమేనని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 2015లో క్వాంటికోతో హాలీవుడ్లో అడుగుపెట్టిన ప్రియాంక, తర్వాత ‘బేవాచ్’, ‘మ్యాట్రిక్స్’ సిరీస్, సిటాడెల్ వంటి ప్రాజెక్టులతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవల ది బ్లఫ్ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్తీ మేరీతో కలిసి అమెరికాలో నివసిస్తున్న ప్రియాంక, ప్రపంచ వేదికలపై భారతీయుల ప్రతిష్టను పెంచుతున్నారు.