‘నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకం సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్-లీలా’లోని ‘రామ్ చాహే లీలా..’ సాంగ్.’ అంటూ బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గత జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. రణ్‌బీర్, దీపికా పదుకొణే ప్రధాన పాత్రల్లో.. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకుడిగా 2013లో విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘రామ్-లీలా’ సినిమా.. అప్పట్లోనే 200కోట్లకు పైగా వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా వైట్ డ్రెస్‌లో నర్తించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్. ఆ గీతం గురించి ఇటీవల గుర్తుచేసుకున్నారు ప్రియాంక చోప్రా. ‘సంజయ్ ఆ పాట కోసం నన్ను సంప్రదించినప్పుడు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాను.
నిజంగా అది కఠినమైన నిర్ణయమే. ఆ పాటకు న్యాయం చేయలేనేమో అనేది నా భయం. అయితే.. సంజయ్ నాకు ధైర్యాన్నిచ్చారు. లొకేషన్లో షూట్‌కు ముందు, షాట్ గ్యాప్‌లో పాటలోని ప్రతి పదం అర్థం విడమర్చి మరీ చెప్పేవారు. పర్టిక్యులర్ డ్యాన్స్ మూమెంట్స్‌లో హావభావాలు ఎలా ఉండాలి అనే విషయంలో అద్భుతమైన సలహాలిచ్చారు. దానికి తోడు కొరియోగ్రాఫర్ కూడా గొప్పగా కంపోజ్ చేశారు. అవన్నీ కలిసొచ్చి ఆ పాట అంత హిట్ అయ్యింది.’ అంటూ రాసుకొచ్చారు ప్రియాంక చోప్రా.