తన భర్త నిక్‌జోనస్‌ను చీర్‌లీడర్‌గా అభివర్ణించింది గ్లోబల్‌స్టార్ ప్రియాంకచోప్రా. కెరీర్, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా అతనో చీర్లీడర్ మాదిరిగా తనలో ఉత్సాహాన్ని నింపుతాడని చెప్పుకొచ్చింది. పెళ్లి తన వ్యక్తిగత జీవితాన్ని మరింత కాంతివంతం చేసిందని ఆనందం వ్యక్తం చేసింది. భర్త ప్రేమాభిమానాలు, కుటుంబ సభ్యులు చూపించే వాత్సల్యంతో జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోగలననే భరోసా ఏర్పడిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నా దృష్టిలో ప్రేమను మించిన గొప్ప ఔషదం ప్రపంచంలో మరొకటి లేదు. ప్రేమకు నిర్దిష్టమైన పరిమితులు, నిర్వచనం లేదు. తల్లిదండ్రులు, భర్తతో పాటు మన శ్రేయస్సును కాంక్షించే వారందరూ జీవితంలో ప్రేమను పంచేవారేనని భావిస్తాను’ అని చెప్పింది. భర్త నిక్‌జోనస్ తన జీవితంలో ఎన్నో మార్పులకు కారణమయ్యాడని వివరించింది ప్రియాంకచోప్రా. ‘వివాహానికి పూర్వం నాలో కోపం ఎక్కువగా ఉండేది. నిక్ సాంగత్యంలో ప్రశాంతచిత్తాన్ని అలవర్చుకున్నా. ఇప్పుడు కామ్‌గా ఉంటున్నా. ఎంతటి సీరియస్ సమస్యలోనైనా అతను ఓ చీర్‌లీడర్‌లా నవ్వులు చిందిస్తూ ఉత్సాహాంగా కనిపిస్తాడు. అతను పక్కనుంటే బాధకు అర్థం మరచిపోతాం’ అని భర్తను ప్రశంసల్లో ముంచెత్తింది.