ప్రియమణి భావోద్వేగానికి లోనయ్యారు. తమ వైవాహిక జీవితంపై కొందరు స్పందిస్తున్న తీరుపై ఆమె అసహనానికి లోనయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా నేరమేనా?.. 2016లో ముస్తాఫారాజ్‌తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఇక అప్పట్నుంచి మొదలైంది నాపై దాడి. నిజానికి నా పెళ్లంటే నా శ్రేయోభిలాషులంతా ఆనందిస్తారని భావించా. కానీ నేను అనుకున్నది వేరు.. జరుగుతున్నది వేరు. 2017లో నా వివాహం జరిగింది. అక్కడ్నుంచి మాపై ద్వేషం రెట్టింపయ్యింది. ఒక ముస్లీంను వివాహం చేసుకోవడమే దీనికి కారణం.
కొందరైతే లవ్ జిహాద్ ఆరోపణలు కూడా చేశారు. ‘పిల్లలు పుట్టాక ఐసీఎస్‌లో జాయిన్ చేయ్..’ అంటూ కామెంట్లు పెట్టారు. ఆవి నన్నెంతో బాధించాయి. సినిమా తారలంటే సోషల్ మీడియా వాళ్లకు పబ్లిక్ ప్రాపర్టీలా ఫీలవుతున్నారు. సరే.. నా భర్త, పిల్లలు ఏంచేశారు? వారిపై ఎందుకు దాడి చేస్తున్నారు. ఈ రోజుక్కూడా నా భర్త, నేనూ కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తే.. పదిలో తొమ్మిది కామెంట్లు మా పెళ్లి గురించే ఉంటాయి.’ అంటూ వాపోయింది ప్రియమణి. ప్రస్తుతం తమిళ అగ్రనటుడు విజయ్ నటిస్తున్న సినిమా ‘జననాయగన్’లోనూ, బాలీవుడ్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ బిజీగా ఉన్నది ప్రియమణి.