సినీ పరిశ్రమలో వేతన అసమానతలపై అసహనం వ్యక్తం చేసిన నటీనటులు కోకొల్లలు. తాజాగా నటి ప్రియమణి కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ ‘పారితోషికానికి నేనెప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజానికి పారితోషికం అనేది స్టార్‌డమ్‌ని బట్టి ఉంటుంది. నా స్థాయి నాకు తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే పారితోషికం తీసుకుంటా. నా సహ నటులకంటే తక్కువగా పారితోషికం అందుకున్న సందర్భాలు నా కెరీర్లో చాలా ఉన్నాయి. దానికి బాధపడను. అర్హతను బట్టే నా డిమాండ్ ఉంటుంది.
అనవసరంగా మాత్రం డిమాండ్ చేశాను.’ అని చెప్పుకొచ్చారు ప్రియమణి. షూటింగ్ టైమింగ్స్ గురించి మాట్లాడుతూ ‘సౌత్‌లో సరిగ్గా 8గంటలకు షూటింగ్ మొదలవుతుంది. కానీ నార్త్‌లో అలా కాదు. అక్కడ టైమ్ సెన్స్ ఉండదు. నేను సౌత్ అమ్మాయిని కావడంతో క్రమశిక్షణ అలవాటైపోయింది. నార్త్ పద్ధతులు నచ్చకపోయినా ఓర్చుకొని పనిచేయడం అలవాటు చేసుకున్నా.’ అని తెలిపారు ప్రియమణి. ప్రస్తుతం తమిళ అగ్ర హీరో విజయ్ ‘జన నాయగన్’ చిత్రంలో నటిస్తున్నారామె. అలాగే ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.