అదృష్టం చెప్పిరాదు. అనుకోకుండా వరిస్తుంది. అది తలుపు తట్టినప్పుడు మనం తీయాలి. ‘ఎంపురాన్’ షూటింగ్లో ఉండగా అదృష్టం మెసేజ్ టోన్‌లో వినిపించింది. ‘ఏంటా?’ అని ఫోన్ చూశాను’ అంటూ ‘వారణాసి’ కథ విన్న క్షణాలను మలయాళ అగ్ర నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ గుర్తు చేసుకున్నారు. తాజా చిత్రం ‘ఐ, నోబడీ’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన ‘వారణాసి’ సినిమా గురించి చెబుతూ ‘ఫోన్ చూడగానే.. ‘కాల్ చేయవచ్చా’ అనే మెసేజ్ కనిపించింది. ఎవరా? అని చూస్తే ‘ఎస్.ఎస్.రాజమౌళి’ అనే అక్షరాలు కనిపించాయి. నేను షాక్. మరుక్షణమే కాల్చేశా. ‘ప్రస్తుతం కథ రాస్తున్నా. అందులో విలన్ పాత్ర ఉంది. చాలా బావుంటుంది. మీకు ఆసక్తి ఉంటే కథ వినిపిస్తా’ అన్నారు రాజమౌళి. ఇదినేను ఊహించని అదృష్టం. షెడ్యూల్ పూర్తవ్వగానే హైదరాబాద్ ఫ్లయిట్ ఎక్కేశా. రాజమౌళిసార్ ఆఫీస్‌లోకి ఎంటరయ్యా. నిజానికి అది ఆఫీస్‌లా లేదు. ఇల్లులా ఉంది.
ఎటు చూసినా కుటుంబ సభ్యులే. ‘ఆ పాత్రకు నన్నే ఎందుకు అనుకుంటున్నారు?’అని వినయంగా అడిగా. ‘ప్రత్యేకించి ఏమీలేదు. ఆ పాత్రకు మీరు బావుంటారు’ అని సూటిగా నవ్వుతూ చెప్పారు రాజమౌళి. ఆలస్యం చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టారు. మూడున్నర గంటలపాటు ఓ అద్భుతాన్ని నా మస్తిష్కం ద్వారా వీక్షించాను. రాజమౌళి విజన్ స్పష్టంగా, పదునుగా కనిపించింది. కాసేపటికి ఏసీ కారణంగా రూమ్ అంతా చల్లబడి, చలి అనిపించింది. కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి రాజమౌళి శరీరమంతా చమటతో తడిసిపోయింది. అంత ఎమోషనల్‌గా చెప్పారాయన. నిజంగా రాజమౌళీ కథ చెప్పే తీరు అద్భుతం. ఆయన చెప్పే తీరులోనే దృశ్యాలు కనిపిస్తాయి. షూటింగ్, ఎడిటింగ్ పూర్తయ్యాక చూస్తే చెప్పినదానికంటే వందరెట్లు తెరపై కనిపించింది. ‘కుంభ’ పాత్రలో నన్ను చూసుకుంటే, నా అంత అదృష్టవంతుడు లేడనిపించింది’ అంటూ భావోద్వేగపూరితంగా మాట్లాడారు పృథ్వీరాజ్ సుకుమారన్.