Prerna Arora | 2024.. భారతీయ చలనచిత్ర రంగంలో నారీశక్తి సంవత్సరమని అభివర్ణిస్తున్నది బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణా అరోరా. గతేడాదిలాగే.. 2025 కూడా మహిళలకే చెందుతుందని ధీమాగా చెబుతున్నది. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 2024లో వినోదరంగ వ్యాపారాన్ని మహిళలే శాసించారని చెప్పుకొచ్చింది. ‘గతేడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాలన్నీ.. మహిళా దర్శకుల నుంచి వచ్చినవే! కిరణ్‌రావు- లాపతా లేడీస్; శుచి తలాటి – గర్ల్స్ విల్ బి గర్ల్స్; శీర్షా గుహా- ఠాకుర్తాస్ దో ఔర్ దో ప్యార్.. వీటన్నిటినీ మించి, పాయల్ కపాడియా- ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్! మహిళల భావాలు, భావోద్వేగాలను తమ గుండెల్లో నింపుకొన్న మహిళలు దర్శకత్వం వహించిన అందమైన చిత్రాలివి’ అంటూ మహిళా దర్శకులను ఆకాశానికెత్తింది.
ఈ సినిమాలన్నీ ఒక మహిళగా, ఒక నిర్మాతగా తనను గర్వపడేలా చేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా.. పాయల్ కపాడియా సినిమా అందరి అంచనాలనూ మించిపోయిందనీ, 2024లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచిందని కొనియాడింది. ఇక ‘సిటాడెల్: హనీ బన్నీ’లో సమంత కూడా ఇరగదీసిందంటూ మెచ్చుకున్నది. 2025లోనూ మరింత మంది కిరణ్ రావులు, పాయల్ కపాడియాలు రావాలనీ, అదే.. ఇండస్ట్రీలో మహిళా సాధికారతకు మరింత గౌరవం తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. తన ప్రొడక్షన్ నుంచి కూడా మహిళా ప్రధాన ఇతివృత్తంలో సినిమాలు చేస్తానంటున్నది. టాయిలెట్, ప్యాడ్మాన్ లాంటి సందేశాత్మక సినిమాలు నిర్మించి.. బాలీవుడ్లో అందరికీ ప్రేరణగా నిలుస్తున్నది ప్రేరణా అరోరా!