తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నిర్మాతలు శనివారం ఫిలిం ఛాంబర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ప్రస్తుతం ఉన్న ఛాంబర్ పాలక మండలి గడువు పూర్తయినప్పటికీ ఇంకా ఎన్నికలు నిర్వహించడం లేదని నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్‌తో పాటు సంబంధిత అధికారులకు అనేకసార్లు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేదని అన్నారు.
సినీ రంగంలో అనేక సమస్యలు ఉన్నాయని, అవన్నీ పరిష్కారం కావాలంటే రెగ్యులర్ కమిటీ ఉండాలని చెప్పారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నదని, ఎన్నికలు నిర్వహించే వరకు ఈ పోరాటం ఆగదని దర్శకనిర్మాత ఆర్.కె.గౌడ్ హెచ్చరించారు. ఇదే ధర్నాలో చిత్రపురి కాలనీలో జరిగిన అవకతవకలపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌గౌడ్, గురురాజ్, మద్దినేని రమేష్, వింజమూరి మధు, కస్తూరి శ్రీను, ఫైట్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.