ప్రధాన తారాగణం: ప్రణవ్ మోహన్ లాల్, సుష్మితా భట్, జయ కురూప్
దర్శకత్వం: రాహుల్ సదాశివన్
సంగీతం: క్రిస్టో జేవియర్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ (వైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్)
తెలుగు విడుదల: స్రవంతి మూవీస్ (రవి కిషోర్)
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డీయస్ ఈరే’ (Dies Irae). ఈ చిత్రం మలయాళంలో విడుదలై సూపర్ హిట్ కావడమే కాక, దాదాపు రూ. 50 కోట్లు వసూలు చేసింది. ‘భూతకాలం’, ‘భ్రమయుగం’ లాంటి హారర్ హిట్స్ డైరెక్ట్ చేసిన రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తెలుగులో స్రవంతి మూవీస్ (రవి కిషోర్) ద్వారా విడుదలైంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ
రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ఒక ఆర్కిటెక్ట్. తండ్రి వ్యాపారాలు అమెరికా, కేరళలో ఉండడంతో వాటిని మేనేజ్ చేస్తూ ఉంటాడు. కేరళకు వచ్చిన రోహన్ స్నేహితులతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో, తన క్లాస్మేట్ కని (సుస్మిత భట్) ఆత్మహత్య చేసుకుందనే విషయం తెలుస్తుంది. గతంలో కనితో శారీరకంగా బంధం ఉన్న రోహన్, తమ వ్యవహారాల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకుందేమో అనే అనుమానంతో వారి ఇంటికి వెళ్లి వస్తాడు. ఆ తర్వాత నుంచే అతన్ని ఒక ఆత్మ వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అది కని ఆత్మే అని భావించి, పక్కింట్లో ఉండే మధు పొట్టి (జిబిన్ గోపీనాథ్) సాయం కోరతాడు. ఈ క్రమంలో వారు తెలుసుకున్న నిజాలేమిటి? రోహన్‌ను వెంటాడుతున్న ఆత్మ ఎవరిది? అసలు ఫిలిప్ ఎవరు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
‘డీయస్ ఈరే’ రొటీన్ దెయ్యం కథే అయినా, దర్శకుడు రాహుల్ సదాశివన్ తనదైన మేకింగ్‌తో ఆకట్టుకున్నారు. హారర్‌ను పూర్తిస్థాయిలో చూపించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. సినిమాకు ప్రధాన బలం సౌండ్ డిజైన్. క్రిస్టో జేవియర్ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకులను భయపెట్టేలా ఉంది. హారర్ చిత్రాల్లో ఉండే జంప్ కట్స్, షార్ప్ ఎడిట్స్ వంటి టెక్నిక్స్‌ను చక్కగా వాడుకున్నారు. సినిమాటోగ్రఫీ కూడా సీన్స్‌కి తగ్గట్టుగా ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్‌గా ఇది టాప్ నాచ్ ఫిల్మ్. ప్రథమార్థం కాస్త నెమ్మదిగా సాగుతూ, రొటీన్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు అసలు కథలోకి వెళ్లలేదు. అయితే, ద్వితీయార్థం లో చివరి 20 నిమిషాలు మాత్రం సినిమాను వేరే స్థాయికి తీసుకెళ్లాయి. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విజయం సాధించారు.
నటీనటులు
రోహన్ పాత్రలో ప్రణవ్ మోహన్ లాల్ చాలా సెటిల్‌గా కనిపించాడు. తన లుక్స్, స్టైలింగ్, నటనతో ఆకట్టుకున్నాడు. ఈ పాత్రలో ప్రణవ్ నటన సినిమాకు ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాలో అందరూ మాట్లాడుకునే మరో ముఖ్యమైన పాత్ర జయ కురూప్ది. ఆమె నటన అద్భుతంగా ఉంది. అరుణ్ అజయ్ కుమార్, జిబిన్ గోపీనాథ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
చివరిగా హారర్ థ్రిల్లర్ లవర్స్‌కు ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. రొటీన్ కథాంశం, ఫస్ట్ హాఫ్‌లో కొంత నెమ్మదించినా, టెక్నికల్ విలువలు, ముఖ్యంగా సౌండ్ డిజైన్ మరియు క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి.