ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ప్రకాశ్‌రాజ్ 2024 కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. కేరళ ప్రభుత్వం ప్రతీ ఏటా ప్రతిష్టాత్మకంగా ఈ పురస్కారాలను అందజేస్తున్నది. 2024 సంవత్సరానికిగాను 128 చిత్రాలు పోటీలో ఉన్నాయి. వీటిలో వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ చిత్రాలను ఎంపిక చేయడానికి ప్రకాశ్‌రాజ్ నేతృత్వంలో జ్యూరీ కమిటీని కేరళ ప్రభుత్వ చలనచిత్ర అకాడమీ ఏర్పాటు చేసింది.
అవార్డు కమిటీ చైర్మన్‌గా ఎంపిక చేయడం పట్ల ప్రకాశ్‌రాజ్ సోషల్‌మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవమని, ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడానికి నిబద్దతతో పనిచేస్తానని అన్నారు. దక్షిణాదితో పాటు హిందీ, ఇంగ్లీష్ చిత్రాల ద్వారా విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఐదుసార్లు జాతీయ అవార్డులు గెలుచుకొని సత్తా చాటారు.